6 April, 2026 | 2:46 AM

మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి

06-04-2026 12:11 AM

బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో వక్తల పిలుపు

నివాళులు అర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ

ఆదిలాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): దళితుల ఆశాజ్యోతి, మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ముఖ్య అతిథులు బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అంతకుముం దు స్థానిక ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా జగ్జీవన్ రామ్, అంబేద్కర్, పూలే దంపతుల విగ్రహాలకు,  జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎస్టీయూ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... సామాన్య కుటుంబంలో జన్మించిన జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 

బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వంటి మహనీయుల జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకోవాలని, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.  నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పీఎంఈజీపీ, ముద్రా లోన్ల వంటి పథకాల ద్వారా రాయితీతో కూడిన రుణాలు అందిస్తోందని వివరించారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు, పాడి పశువుల పంపిణీ, సోలార్ ఫామ్స్ వంటి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యేలు  మాట్లాడుతూ... మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని  పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఆదిలాబాద్లో సుమారు 2000 ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రాథమిక సర్వే పూర్తయిందని, త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. అలాగే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విమానాశ్రయ నిర్మాణ పనులు మరో రెండు మూడు నెలల్లో ప్రారంభమవుతాయని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. దళిత యువతకు బ్యాంకుల ద్వారా త్వరితగతిన రుణాలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అధికారి సునీత కుమారి, ఈడి మనోహర్, డిహెమ్హెచ్‌ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డివైఎస్‌ఓ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.