20-01-2026 06:02:25 PM
నిర్మల్,(విజయక్రాంతి): రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మైనార్టీ సోదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రంజాన్ నెలలో మసీదుల దగ్గర నిరంతరం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. మసీదుల దగ్గర ప్రార్థనా సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. మసీదుల పరిసర ప్రాంతాల్లో అవసరమైన చోట రోడ్లకు మరమ్మత్తులు చేయాలని, పార్కింగ్ సమస్యలు ఏర్పడకుండా చూడాలన్నారు.
మసీదులలో ఎప్పుడూ త్రాగునీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రార్థనా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలకు ఏవైనా సమస్యలు ఎదురైతే అధికారులు త్వరితగతిన స్పందించి, వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. మసీదుల పరిసర ప్రాంతాల్లో ఏవైనా సమస్యలు ఉంటే వాటి వివరాలు తెలిపేందుకు క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. రంజాన్ పండుగనాడు అన్ని ఈద్గాలలో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా తగు చర్యలు చేపట్టాలన్నారు.
ఈద్గాలలో త్రాగునీరు, షామియానాలు, ఇతర ఏర్పాట్లను చేయాలన్నారు. పిచ్చి మొక్కలు, పొదలు తొలగించి, ఈద్గా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అన్ని మతాల పండుగలను సహోదర భావంతో జరుపుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, మైనారిటీ అధికారి మోహన్ సింగ్, ఆర్డీవో రత్నకళ్యాణి, ముస్లిం మత పెద్దలు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.