చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
- కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,(విజయక్రాంతి): చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యకరమైన భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ పక్వాడ ఎనిమిదవ విడత కార్యక్రమానికి జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనితలతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోషణ్ పక్వాడ ఎనిమిదవ విడత కార్యక్రమం ఈ నెల 9 తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించడం జరిగిందని, పిల్లలలో మొదటి 6 సంవత్సరాల కాలంలో మెదడు అభివృద్ధి గరిష్టంగా ఉంటుందని, ఈ విషయం ప్రధాన అంశంగా పరిగణలోకి తీసుకుని ప్రత్యేక దృష్టి సాధించడం జరిగిందన్నారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి పోషకాహారం అత్యవసరమని, గర్భిణి స్త్రీలు, చిన్నపిల్లలకు సరైన ఆహారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తు నిర్మించవచ్చన్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని, గర్భిణులు, బాలల పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, తొలి వేయి రోజులలో సరైన పోషణ, శిశు అభివృద్ధిపై దృష్టి సారించాలని, అంగన్వాడి కేంద్రాల ద్వారా ఆటల ఆధారిత విద్యను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.
పోషణ పంచాయతీలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పిల్లలలో స్క్రీన్ టైమ్ తగ్గించే దిశగా తల్లిదండ్రులకు మార్గదర్శకాలు అందించాలని సూచించారు. నలుగురు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, బాలలకు అక్షరాభ్యాసం, గ్రాడ్యుయేషన్ ధ్రువపత్రాల అందజేత కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా స్థానిక సమాజం, తల్లులు, సంరక్షకులను భాగస్వామ్యం చేస్తూ పోషకాహారం పై విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.






