1 April, 2026 | 1:55 AM

నాణ్యమైన విద్య అందించడంపై ప్రత్యేక దృష్టి

01-04-2026 12:09 AM

పాఠశాల, అంగన్వాడి కేంద్రాలపై కలెక్టర్ సమగ్ర పరిశీలన

సంగారెడ్డి, మార్చి 31: జిల్లాలో విద్యా, శిశు సంక్షేమ సేవల అమలు పరిశీలనలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి, అక్కడి వసతులు, సేవల నాణ్యతపై సమగ్రంగా పరిశీలించారు.

మొదట ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్ తరగతి గదుల పరిస్థితి, పరిశుభ్రత, మరుగుదొడ్లు, త్రాగునీటి సదుపాయం, విద్యుత్ సరఫరా, పాఠశాల పరిసరాలు, కాంపౌండ్ వాల్ వంటి మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యతపై ఆరా తీశారు. భోజనం బాగుందని విద్యార్థులు తెలపడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ఉపాధ్యాయులు, సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పలు చర్యలు చేపడుతోందని తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని, ప్రతి విద్యార్థి చదువు పై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పిల్లలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, త్రాగునీరు, చల్లని వాతావరణం కల్పించాలని తెలిపారు. అనంతరం గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్, ఇండ్ల ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అశోక్, ఎంపీడీవో వేణుగోపాల్, సర్పంచ్ అనంతరెడ్డి, హౌసింగ్ ఏఈ తదితరులు పాల్గొన్నారు.