పదివేల మంది టీచర్లకు పదోన్నతులు!
- ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయ సంఘాలు
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. 10వేల మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్ 19 జిల్లాల్లోని దాదాపు 4900 మంది భాషా పండితులు, 900 మంది పీఈటీలను కలుపుకొని పది వేల మంది ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నో కోర్టు చిక్కులు, అవాంతరాలను పరిష్కరించుకుంటూ టీచర్లకు పదోన్నతులను కల్పించడంతో ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
ఎన్నో ఏళ్ల నిరీక్షణ : టీపీఆర్టీయూ
ఇది ఎన్నో ఏళ్ల నిరీక్షణ. ప్రమోషన్లు లేకుండానే ఎంతో మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేశారని పీఆర్టీయూతెలంగాణ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.చెన్నయ్య, ఎస్.భిక్షం గౌడ్ తెలిపారు.
పొరపాట్లు సవరించాలి: యూటీఎఫ్
మల్టీజోన్‌ేొ1 పరిధిలోని కొన్ని జిల్లాల ప్రమోషన్ ఉత్తర్వుల్లో దొర్లిన పొరపాట్లను సవరించాలని యూటీఎప్ అధ్యక్ష, కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి కోరారు. ఒకటికన్నా ఎక్కువ సబ్జెక్టుల్లో ప్రమోషన్ పొందినవారి వివరాలను డీఈఓల నుండి సేకరించి, మిగిలిన ఖాళీల్లో తదుపరి పదోన్నతులు ఇచ్చే విషయమై నిర్ణయం తీసుకోవాలని కోరారు.
కృతజ్ఞతలు: టీఎస్‌సీపీఈయూ
రాష్ట్ర వ్యాప్తంగా 18,495 మంది ఉపాధ్యాయులను అర్హులుగా గుర్తించి, వారిలో ప్రధానోపాధ్యాయులుగా 763 మంది, స్కూల్ అసిస్టెంట్లుగా 5123, ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలుగా 2130, భాషా పండితులు, పీఈటీలు 10,479 మంది స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందడంపై తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.






