24-02-2026 01:36:09 AM
కరీంనగర్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): వేసవి కాలంలో త్రాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా... ప్రత్యేక చర్యలు తీస్కుంటున్నామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. సోమవారం నగరంలోని మానేరు డ్యాం సమీపంలో గల నగరపాలక సంస్థ నీటి శుద్దీకరణ కేంద్రాన్ని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సంధర్శించారు. ఈ సంధర్బంగా మేయర్ మాట్లాడుతూ నగరంతో పాటు విలీన గ్రామాల డివిజన్ల ప్రజలకు ప్రతి రోజు త్రాగు నీటిని సరఫరా చేసేలా నగరపాలక సంస్థ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ప్రధానంగా నూతన విలీన గ్రామాల డివిజన్ల త్రాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని తెలిపారు. మానేరు డ్యాం నీటి మట్టం 7 టీఎంసీలకు చేరడంతో... అదే నీటి సామర్థ్యం పాటించేలా ఇరిగేషన్ అధికారులను ఆదేశించామని తెలిపారు.
వేసవి కాలంలో నీటి ఇబ్బందులు రాకుండా సమ్మర్ ఆక్షన్ ప్రణాళిక రూపొందించామని, ఎక్కడ ప్రజలకు త్రాగు నీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే త్రాగు నీటి సమస్యను పరిష్కారం కోసం 49 లక్షల నిధులను కేటాయించి టెండర్ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. అవసరాన్ని బట్టి విలీన గ్రామాల డివిజన్ల త్రాగు నీటి కొసం అద్దెకు బావులు తీసుకోవడం తో పాటు ట్యాకర్ల ద్వారా నీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మాసం గణేష్, డీఈ దేవేంధర్, ఏఈ, సిబ్బంది పాల్గొన్నారు.