27 August, 2026 | 2:25 AM

డిఫాల్టర్లపై మిషన్ కే-100

27-08-2026 12:00 AM
  1. సీఎంఆర్ రికవరీకి స్పెషల్ ఆపరేషన్
  2. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ తదితర శాఖల సిబ్బందితో ప్రత్యేక టీంలు  
  3. జిల్లాల వారీగా దర్యాప్తు వేగవంతం
  4. మిల్లర్ల అక్రమాలపై లోతైన విచారణ
  5. తప్పంచుకునే మార్గాలన్నీ మూసివేత
  6. ఇప్పటికే పలువురి అరెస్ట్
  7. రూ.వెయ్యి కోట్ల ధాన్యం రికవరీ     

(బండి సంపత్‌కుమార్) :

మహబూబాబాద్, ఆగస్టు 2౬ (విజయక్రాంతి): సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) ధాన్యా న్ని పక్కదారి పట్టించి, ప్రభుత్వానకి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఎగవేసి కోట్ల రూపాయలు స్వాహా చేసిన డిఫాల్ట్ రైస్ మిల్లర్లకు తప్పించుకునే దారులు మూసుకుపోతున్నాయి. సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అమలు చేస్తున్న మిషన్ కే-100తో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై ఉక్కుపాదం పడుతోంది.

ఇంతకాలం రాజకీయ పలుకుబడి, కొందరి సహకారంతో వ్యవస్థను మోసం చేసిన వారికి ఇప్పుడు చట్టపరమైన చర్యలు తప్పని పరిస్థితి ఏర్పడింది. ‘వైట్ కాలర్’ దందాలకు తెరదించేందుకు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో డిఫాల్ట్ మిల్లర్లు చక్రబంధంలో చిక్కుకుంటున్నారు. సీఎంఆర్ బకాయిల రికవరీతో పాటు బాధ్యులపై కఠిన చర్యలకు అధికారులు వేగం పెంచారు.  

ఏళ్ల తరబడి బకాయిల వసూళ్లలో నిర్లక్ష్యం

దాదాపు ఐదేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా వందల మిల్లులు సీఎంఆర్ ధాన్యం తీసుకొని సకాలంలో బియ్యం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాయి. కొన్నిచోట్ల పేరుకుపోయిన ధాన్యం ప్రభుత్వం టెండర్ పెడితే , ఆ ధాన్యాన్ని కూడా ఇవ్వకుండా, 25 శాతం జరిమానా విధిస్తే అది కూడా చెల్లించకుండా ప్రభుత్వానికి గుడిబండగా మారాయి. వేల కోట్ల రూపాయలను దిగమింగి ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టి దర్జాగా తిరుగుతూ.. తమనెవరేమి చేయలేరని, తమకు రాజకీయ పలుకుబడి ఉందని, తమను ముట్టుకునే పరిస్థితి లేదని డాబు దర్పం ఒలకబోస్తూ ఇంత‘కాలం’ నెట్టుకొచ్చారు.

అనేక జిల్లాల్లో బడా రైస్ మిల్లర్లు డిఫాల్ట్ మిల్లర్లుగా మారిపోవడంతో వీరిని ‘ఆదర్శం’గా తీసుకొని మరికొందరు చోటా మిల్లర్లు కూడా వీరి దారిలో పయనించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా డిఫాల్ట్ మిల్లర్లు, టెండర్ ప్యాడి ధాన్యం బకాయిదారుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఒక దశలో వీరిని చూసి అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే వీరిని ఇంత విచ్చలవిడిగా వదిలివేయడం ఏమిటనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి.

కోట్ల రూపాయల ధనంతో కార్లు, బంగాళాలు, మద్యం షాపులు, రియల్ ఎస్టేట్, ఇతర వ్యవహారాల్లో దాన్యం విక్రయించిన డబ్బులు పెట్టుబడి పెట్టి శాసించే స్థాయికి చేరుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డిఫాల్ట్ రైస్ మిల్లర్ల వ్యవహారంపై దృష్టి కేంద్రీకరించింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి డిఫాల్ట్ రైస్ మిల్లర్ల వ్యవహారంపై ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించారు.

సివిల్ సప్లై సంస్థకు బియ్యం బకాయి పడ్డ మిల్లర్లపై ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదని, వెంటనే బకాయిల వసూళ్లకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర డిఫాల్ట్ రైస్ మిల్లర్ల వ్యవహారంలో తనదైన పోలీస్ మార్క్ చూపించే విధంగా చర్యలు చేపట్టారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపట్ల కాస్త కఠినంగా వ్యవహరించే విధంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.

దర్యాప్తునకు ప్రత్యేక టీంలు

డిఫాల్ట్ మిల్లర్లపై దర్యాప్తు వేగవంతం చేయటానికి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ తోపాటు వివిధ శాఖల నుంచి 500 మందికి పైగా ఎంపిక చేసిన ప్రత్యేకంగా ఎన్ఫోర్స్‌మెంట్, టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వ్యవస్థీకృత నేరగాళ్ల పనిపట్టే కార్యక్రమం చేపట్టారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో లోతైన విచారణ జరిపి, ఇంతకాలం ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన డిఫాల్ట్ మిల్లర్లను చక్రబంధంలో బిగిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో గత ఐదేళ్ల నుంచి ధాన్యం తీసుకొని బియ్యం ఇవ్వకుం డా ముప్పు తిప్పలు పెడుతున్న బడా మిల్లర్లను అరెస్టు చేయడంతో పాటు దిగమింగిన ధాన్యాన్ని కక్కిస్తున్నారు. డిఫాల్ట్ మిల్లర్ల పని పట్టడానికి ‘మిషన్ కే 100’ పేరుతో స్పెషల్ ఆపరేష్ చేపట్టారు. 

ఇప్పటికే పలువురు డిఫాల్ట్ మిల్లర్లను అరెస్ట్ చేసి, వారి నుంచి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని రికవరీ చేశారు. మరో రూ.3వేల కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని డిఫాల్టర్ల నుంచి ముక్కు పిండి రికవరీ చేసేలా ప్రత్యేక బృందాలు ముందుకెళ్తున్నాయి. 

జిల్లాల వారీగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించి, వారిని అదుపులోకి తీసుకునేందుకు ముందస్తుగానే పగడ్బందీ వ్యూహం, పట్టుకున్న తర్వాత వారిపై చట్టపరమైన చర్యలతో ఉక్కుపాదం మోపుతూ డిఫాల్ట్ మిలర్లకు చుక్కలు చూపుతున్నారు. సివిల్ సప్లు స్పెషల్ ఆపరేషనతో.. ఇంతకాలం దర్జాగా తిరిగిన డిఫాల్ట్ మిల్లర్లు బకాయిలను తప్పక చెల్లించే పరిస్థితి ఏర్పడింది.