27 August, 2026 | 3:26 AM

జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో సర్ ప్రక్రియపై శిక్షణ తరగతులు

27-08-2026 02:24 AM

అవగాహన కల్పించిన వెన్నెల గద్దర్ 

సంగారెడ్డి, ఆగస్టు 26 : ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా వచ్చే పదిహేను రోజులు బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) అప్రమత్తంగా పనిచేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి సూచించారు. వారి ఆధ్వర్యంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని బీఎల్‌ఏలు, పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సంగారెడ్డి పట్టణం లోని క్లాసిక్ గార్డెన్ లో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్పొరేషన్ చైర్మెన్, సర్ ప్రక్రియ పార్లమెంట్ కో ఆర్డినేటర్ వెన్నెల గద్దర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, అసెంబ్లీ కోఆర్డినేటర్ దయాకర్, మాస్టర్ ట్రైనర్ చైతన్యలు ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై బీఎల్‌ఏలకు అవగాహన కల్పించారు. రెండో దశ ఎస్‌ఐఆర్లో భాగంగా నేడు నిర్వహిస్తున్న గ్రామ సభలకు బీఎల్‌ఏలు తప్పనిసరిగా హాజరై, ఓటర్లకు సంబంధించిన వివరాలను పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు.

ఇప్పటికీ ఎన్యుమరేషన్ ఫారాలు అందని అర్హులైన ఓటర్లకు తప్పనిసరిగా ఫారం-6 అందజేసి, వారి ఓటు హక్కును పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. డెత్ లేదా ఆబ్సెంట్గా నమోదైన ఓటర్ల ఇళ్లకు బీఎల్‌ఏలు స్వయంగా వెళ్లి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఇదే కీలకమైన, చివరి అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకుని ప్రతి ఓటు వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని నాయకులు బీఎల్‌ఏలకు సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఎల్‌ఏలకు పూర్తి సహకారం అందించి ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.