ప్రభుత్వంపై పెన్షన్ల భారం!
- ఓ వైపు ప్రతినెలా చెల్లిస్తున్నా ఇంకా పేరుకుపోతున్న వివిధ బిల్లులు
- చెల్లించాల్సింది ఇంకా రూ.8 వేల కోట్లపైనే అంటున్న ఉద్యోగ సంఘాలు
- ప్రతి నెలా 500 700 మంది ఉద్యోగుల పదవీవిరమణ
- వీరికి చెల్లించాల్సినవే నెలకు రూ.350 కోట్ల నుంచి రూ.500 కోట్లు
- పూర్తిస్థాయిలో చెల్లింపులు కాక ఇబ్బందుల్లో ఉద్యోగులు, పెన్షనర్లు
- సేవ చేసి సొమ్ము కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి అంటూ ఆవేదన
హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు బిల్లులు ప్రభుత్వం ఇచ్చింది గోరంతా అయితే ఇవ్వాల్సింది ఇంకా కొండంతగా ఉన్నది. ఉద్యోగులకు ఇవి న్యాయంగా దక్కాల్సిన బిల్లులే. అయితే ఇవి ప్రతి నెలా కొండలా పేరుకుపోతున్నాయి. ఓ వైపు వీరికి బిల్లులు ఏకకాలంలో చెల్లించలేక, మరోవైపు ఖజానాలో సరిపడా నిల్వలు లేక ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక భారం పెరుగుతున్నది.
అయితే దీనిని సాకుగా చూపి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఇచ్చిన ప్రభుత్వం.. రిటైర్‌మెంట్ తర్వాత వారికి ఆర్థిక భద్రత ఇవ్వడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నదనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి చూస్తే, జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసినందుకు దక్కుతున్న ప్రతిఫలం ఇదేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతి నెలా పదవీవిరమణ పొందుతున్న ఉద్యోగులు సుమారు 500 నుంచి 700 మందికిపైగానే ఉంటున్నారు. ఒకవైపు ఇప్పటికే చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, మరోవైపు ప్రతి నెలా రిటైరవుతున్న ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ భారీస్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి బిల్లులు భారంగా మారుతున్నాయి. చెల్లింపులకు ఆపసోపాలు పడుతున్నది.
ఖజానాపై తీవ్ర భారం
ఈ ఏడాది 9,719 మంది ఉద్యోగులు రిటైరవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులు, రిటైరవుతున్న వారికి చెల్లించాల్సిన బిల్లులను క్రమంగా చెల్లిస్తూ వస్తున్నది. అయితే ఆ చెల్లింపులు తక్కువగా ఉండటం.. చెల్లించాల్సినవి ఇంకా భారీగా ఉండటంతో పెండింగ్ బిల్లులు కొండలా పేరుకుపోతున్నాయి. తొలుతా వీరి బిల్లులను రూ.150 కోట్లుగా ప్రభుత్వం చెల్లిస్తూ వచ్చింది.
ఆ తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా దాన్ని క్రమంగా పెంచుకుంటూ రూ.250 కోట్లు, రూ.500 కోట్లు, రూ.750 కోట్ల నుంచి రూ.1,000 కోట్లుగా చెల్లిస్తూ వచ్చింది. ఆ తర్వాత 100 రోజుల్లో రూ.6 వేల కోట్లను విడుదల చేస్తామని చెప్పినట్టుగానే మే, జూన్, జూలై నెలల్లో రూ.2 వేల కోట్ల చొప్పున విడుదల చేసింది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీతాలకు రూ.44 వేల కోట్లు, పెన్షన్ల కోసం రూ.13 వేల కోట్లు ఖర్చు అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 2025 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఉద్యోగుల జీతాల కోసం రూ.47 వేల కోట్లు ఖర్చు చేయగా, పెన్షన్ల కోసం రూ.19,300 కోట్లు ఖర్చుచేసింది.
2026 ఆర్థిక సంవత్సరంలో జీతాల కోసం రూ.48,300 కోట్లు, పెన్షన్ల కోసం రూ.14,700 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేయగా, జూన్ నాటికి జీతాలకే రూ.13 వేల కోట్లు, పెన్షన్ల కోసం రూ.7,300 కోట్లు విడుదల చేసింది. ఇలా ఉద్యోగుల వేతనాలు, రిటైరయ్యే వారికి చెల్లించేందుకు కేటాయించిన పెన్షన్ నిధులు సరిపోవడంలేదు. కేటాయింపులు తక్కువగా, చెల్లించాల్సినవి భారీగా ఉంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనూ అంచనాల కంటే ఎక్కువగానే ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇంకా రూ.8 వేల కోట్లకుపైగా బిల్లులు చెల్లించాల్సి ఉన్నది.
దీనికి తోడూ ప్రతి నెలా రిటైరవుతున్న ఉద్యోగులకు చెల్లించాల్సినవి అదనం. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ బిల్లులు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నది. ఏదో రకంగా సర్దుకుంటూ ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా సర్కారు బండిని నడిపిస్తున్నది. జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన ఉద్యోగులకు రిటైర్‌మెంట్ తర్వాత కూడా తమ సొంత డబ్బు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.
పేరుకుపోతున్న బకాయిలు
ప్రతి నెలా పదవీ విరమణ పొందుతున్న వారికి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నెలకు సగటున 500 నుంచి 700 మందికిపైగా ఉద్యోగ, ఉపాధ్యాయులు, ఉన్నతస్థాయి అధికారులు పదవీ విరమణ పొందుతున్నారు. ఒక్కోక్కరికీ సగటున రూ.70 లక్షల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చూసుకుంటే వీరికి నెలకు రూ.350 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు బిల్లులను ప్రభుత్వం చెల్లించాలి. ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు ఇంకా రూ.8 వేల కోట్లకుపైగానే ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు.
ఇందులో గ్రాట్యూటీ, కమ్యూటేషన్ పెన్షన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, టీజీఎల్‌ఐతోపాటు వివిధ రకాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు జీతాలు ఆలస్యం, ఇప్పుడు రిటైరయ్యాక బకాయిల కోసం నెలల తరబడి ట్రెజరీ అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొన్నదని పెన్షనర్లు వాపోతున్నారు. చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు పిల్లల పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు, ఇంటి రుణాల కోసం ఈ డబ్బుపైనే ఆధారపడుతున్నారు. ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోవడంతో వారు ఆర్థికంగా చితికిపోతున్నారు.






