ఎన్టీఆర్ స్టేడియం చుట్టూ ఇసుక దందా?
- రోడ్డు పక్కనే కంకర, ఇటుకలు, ఇతర వ్యాపారం
- ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
- అధికారుల అండదండలతో వ్యాపారాలు
ముషీరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం ప్రహరీ చుట్టుపక్కల ఇసుక అక్రమ దందా, కంకర, ఇటుకల వ్యాపారాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కవాడిగూడ డివిజన్ ఎన్టీఆర్ స్టేడియం ప్రహరీ గోడను ఆనుకొని ఉన్న ప్రధాన రహదారి పక్కనే ఇసుక, కంకర, ఇటుకలను నిల్వ చేసి విక్రయిస్తుండటంతో ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో తీవ్ర ఇబ్బంది అవుతోందని వాహనదారులు పేర్కొంటున్నారు.
రోడ్డు పక్కనే నిల్వలు
ఎన్టీఆర్ స్టేడియం ప్రహరీ చుట్టూ రోడ్డు పక్కనే భారీగా ఇసుక, కంకర, ఇటుకలను నిల్వ చేస్తున్నారు. వ్యాపార కార్యకలాపాల కోసం ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహనాలు రహదారిపై నిలిపివేయడం వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు.
తరచూ ప్రమాదాలు
రోడ్డు పక్కన నిర్మాణ సామగ్రి నిల్వ చేయడం, వాహనాల రాకపోకలు పెరగడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పాదచారులు రోడ్డుపై నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని చెబుతున్నారు.
అధికారుల అండదండలతోనేనా?
ఈ అక్రమ వ్యాపారాలు ఇంతకాలంగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల అండదండలతోనే ఈ వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రహదారి పక్కనే ఇసుక, కంకర, ఇటుకల నిల్వలు కనిపిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.
చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఎన్టీఆర్ స్టేడియం పరిసరాల్లో కొనసాగుతున్న అక్రమ ఇసుక, కంకర, ఇటుక వ్యాపారాలపై సంబంధిత అధికారులు వెంటనే దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. రహదారులను ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యాపారాలను తొలగించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అలాగే అక్రమంగా ఇసుక నిల్వలు, విక్రయాలు జరుగుతున్నాయా అనే అంశంపై సమగ్రంగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజల భద్రతకు సంబంధించిన అంశంలో అధికారులు ఇకనైనా చోద్యం చూడకుండా స్పందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.






