21 March, 2026 | 4:38 AM

ఘూలేలాల్ జీ స్ఫూర్తితో ‘సింధీ’లకు ప్రత్యేక గుర్తింపు

21-03-2026 01:23 AM

- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్, మార్చి 20 (విజయక్రాంతి): భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్న ఒక ప్రాచీన, సాంస్కృతికంగా స మృద్ధి చెందిన సమాజం సింధీలదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. దేశ విభజన సమయం లో సింధీ సమాజానికి విపరీతమైన నష్టం జరిగినా, ఝూలేలాల్ జీ స్పూర్తితో ఆయన చూపిన బాటలో నడుస్తూ ప్రత్యేక గుర్తింపును తిరిగి తెచ్చుకుంటూ తమ సంప్రదాయాలను కొనసాగిస్తున్న ఘనత సింధీ సమాజానిదేనని పేర్కొన్నారు.

సింధీల ఆర్యాధ్య దైవం ఝూలేలాల్ జయంతి సందర్భంగా శుక్రవారం నగరంలోని వైశ్యా భవన్ సమీపంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరై మాట్లాడుతూ తెలుగు వారికి ఉగాది పర్వదినం ఎంతటి ప్రాధాన్యత ఉందో, సింధీ సమాజానికి ఈరోజు అంతటి ప్రాధాన్యత ఉందన్నారు.

సింధీ సమాజానికి దైవ రక్షకుడు, సింధీ ప్రజల ఆరాధ్య దైవం, మార్గదర్శకుడైన భగవాన్ ఝూలేలాల్ జీ జయంతి అని, ఆ మహానుభావుడు పుట్టిన రోజునే సింధీ సమాజమంతా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటోందన్నారు.  ఈ వేడుకలనే “చేటీ చంద్‌” పర్వదినంగా భావిస్తూ సింధ్ సమాజం పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఝూలేలాల్ జీ బాటలో నడుస్తూ మరింతగా రాణిస్తూ సమాజానికి సేవ చేయాలని, కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవాలని  కోరారు.