మంత్రి సీతక్క క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించిన ఆశా వర్కర్లు
- జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత
తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆశా వర్కర్ల ఆందోళన
ములుగు,మార్చి20(విజయక్రాంతి):ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున మోహరించి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించడం సంచలనంగా మారింది. తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా వేతనాల పెంపు డిమాండ్ను సాధించేందుకు ఆశా వర్కర్లు ఈ ఆందోళనకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వందల సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
ఉదయం నుంచే జిల్లా కేంద్రానికి చేరుకున్న వారు ర్యాలీగా సాగుతూ నినాదాలతో మారుమోగించారు. కాంగ్రెస్ హామీలు వెంటనే అమలు చేయాలని, ఆశా వర్కర్లకు రూ.18,000 కనీస వేతనం ఇవ్వాలి అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆశా వర్కర్లు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీగా మోహరించారు.
నిరసనను అణచివేయడానికి ప్రయత్నించిన పోలీసులతో ఆశా వర్కర్ల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ.. తాము ఎన్నో సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని, ప్రభుత్వం తమ సేవలను గుర్తించి గౌరవప్రదమైన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇకపోతే, పోలీసులు పరిస్థితిని క్రమంగా అదుపులోకి తీసుకువచ్చి శాంతి భద్రతలను పునరుద్ధరించారు. అయినప్పటికీ, ఆశా వర్కర్ల ఆందోళనతో జిల్లా కేంద్రంలో కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది. డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగింపు తమ డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని ఆశా వర్కర్లు స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించేందుకు సిద్ధమని ప్రకటించారు.




