24 May, 2026 | 11:17 AM

సరస్వతి అంత్య పుష్కరాల్లో విశేష పూజలు

24-05-2026 10:45 AM

అద్వైతానంద భారతి స్వామీజీ

కాలేశ్వరం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అద్వైతానంద భారతి, శ్రీశ్రీ అవని శృంగేరి జగద్గురువులు, శంకరాచార్య మహాసంస్థానం స్వామీజీలు శనివారం కాళేశ్వరం చేరుకుని సరస్వతి నదిలో పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించారు. వేద మంత్రోచ్చారణల మధ్య నదీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.

అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంకు చేరుకోగా ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా పార్వతి అమ్మవారికి, మహా సరస్వతి అమ్మవారికి విశేష హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివ నామస్మరణలతో మారుమోగింది. తదనంతరం ఆశీర్వచన మండపంలో ఆలయ తరఫున స్వామీజీ కి  పండ్లు, శేష వస్త్రాలు సమర్పించి సన్మానించారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందించిన స్వామీజీకి సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.