24 May, 2026 | 11:16 AM

ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ వైర్ చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా ముఠా అరెస్ట్

24-05-2026 10:42 AM

రూ.80 వేల విలువైన కాపర్ వైర్, రూ.20 వేల విలువైన ఏసీ ఔటర్,2 మోటార్ బైక్‌లు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం

రామగిరి పోలీస్ స్టేషన్ లో డీసీపీ రాంరెడ్డి

రామగిరి,(విజయక్రాంతి): పంట పొలాల వద్ద, రోడ్ల వెంబడి ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ వైరును చోరీ చేస్తున్న దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్‌రెడ్డి తెలిపారు. రామగిరి పోలీస్ స్టేషన్‌లో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, మంథని సీఐ బొల్లపల్లి రాజు, రామగిరి ఎస్‌ఐలు తాడవేని శ్రీనివాస్, దివ్య, సిబ్బందితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

శనివారం మధ్యాహ్నం నమ్మదగిన సమాచారం మేరకు కల్వచర్ల మారుతీనగర్ హనుమాన్ ఆలయం వద్ద దొంగిలించిన వస్తువులను తరలిస్తుండగా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లికి చెందిన శీర్ల లచ్చయ్య, మోటం దేవేందర్, మోటం జంపయ్య, మోటం అజయ్‌లను ఎస్‌ఐ తాడవేని శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరంతా దగ్గరి బంధువులని, ప్రస్తుతం రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నారని చెప్పారు.

వీరు ఒక ముఠాగా ఏర్పడి రామగిరి మండలం పన్నూరులోని జేఎన్‌టీయూ కళాశాల సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్, మంథనిలోని అయ్యగారు చెరువు కట్ట, కూచిరాజ్‌పల్లి, అక్కేపల్లి ప్రాంతాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లు, సుల్తానాబాద్ మండలం భూపతిపూర్‌లోని ట్రాన్స్‌ఫార్మర్, అంతర్గాం మండలం కుందనపల్లి పంప్‌హౌస్ సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్, రామగిరి మండలం కల్వచర్ల కృష్ణవేణి పాఠశాలలోని ఏసీ ఔటర్ చోరీలకు పాల్పడినట్లు తెలిపారు.

దొంగిలించిన రాగి వైర్, ఏసీ ఔటర్‌ను మోటార్ బైక్‌లపై తరలిస్తుండగా కల్వచర్ల హనుమాన్ ఆలయం వద్ద పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.80 వేల విలువైన కాపర్ వైర్,రూ.20 వేల విలువైన ఏసీ ఔటర్, 2 మోటార్ బైక్‌లు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని, వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రామగిరి ఎస్‌ఐలు తాడవేని శ్రీనివాస్, దివ్య, సిబ్బంది దుబాసి రమేష్, అభిషేక్,  రాజ్‌కుమార్‌లను డీసీపీ, ఏసీపీలు అభినందించారు.