6 July, 2026 | 2:19 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

కదిలివచ్చిన కైలాసనాథుడు

30-08-2024 12:22 AM

కలికాలంలో అద్భుతాలు జరగక పోవచ్చు. కానీ, త్రేతాయుగం ఆరంభంలో శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురాముడి కోసం భోళాశంకరుడు ఒక అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించాడంటే నమ్మవలసిందే. తల్లిని హతమార్చిన పాపం నుంచి విముక్తిని పొందడానికి ఆ భార్గవ రాముడు తాను లింగాన్ని ప్రతిష్ఠించిన చోటే తపస్సుకు ఉపక్రమించాడు. ప్రసన్నుడైన శివుడు కైలాసం నుంచి దిగి వచ్చాడు. ఎదురుగా వున్న రాతి లింగంలో ‘కదలిక’ వచ్చేసరికి, ‘శివుడు కదిలె.. శివుడు కదిలె’ అంటూ సంబరపడి పోయాడు. ఈ విచిత్రం జరిగిన ప్రదేశమే నేడు ‘కదిలి’గా ప్రసిద్ధి చెందిందని గ్రామస్థులు చెబుతున్నారు. అప్పట్నుంచీ అన్నపూర్ణ సహిత పాప హరీశ్వరస్వామి ‘కదిలే శివుడు’గా పేరు పొందాడు.

ఎత్తయిన గుట్టలు, వొంపులు తిరిగే రహదారి, చుట్టూ పెద్దపెద్ద చెట్లు. గలగల పారే సెలయేర్లు. ముదురు ఆకుపచ్చ వర్ణంలో మెరిసే ప్రకృతి వాతావరణంలోని లోతైన లోయలోనే పరశురాముడు స్థాపించిన ‘కదిలి’న శివుడు వెలిశాడు. శ్రావణమాసం ముగుస్తున్న ఈ తరుణంలో అనేక విశేషాలకు నెలవైన ఈ దేవాలయా న్ని వేలసంఖ్యలో భక్తులు సందర్శిస్తున్నారు. ఇది స్వయంభూ లింగంగానూ ప్రసిద్ధినొందింది.

నిర్మల్ జిల్లా దిలువార్‌పూర్ మండల కేంద్రానికి 8 కి.మీ. దూరంలోని కదిలి గ్రామ సమీపంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల పరిధిలో, నిర్మల్ రహదారిపై వెలసిన ఈ ఆలయం సుమారు 4 శతాబ్దాల కిందటిదిగా చరిత్రకారులు చెబుతున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ లింగానికి అభిషేకం చేస్తే సకల పాపాలు తొలగడమేకాక పాడిపంటలు సమృద్ధిగా పండుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

పశ్చిమ ముఖద్వారం

ఈ ఆలయ ముఖద్వారం పశ్చిమం వైపు ఉంది. పడమర దర్శనంలో పాపాలు పోతాయని నానుడి. ఈశాన్యంలో అన్నపూర్ణ మాత దక్షణాభిముఖంగా ఉంది. ఈ తరహా అమ్మవారి దర్శనం దేశంలోనే రెండవదిగా చెప్తారు. ఆలయమంతా రాతి కట్టడం. పంచముఖ శిఖరం లోపలి శివలింగం చతురస్రం. ప్రధానద్వారం వద్ద శృంగి, భృంగి నిలువెత్తు విగ్రహాలు. గుడి ఉత్తరద్వారం వద్ద హనుమంతుడు.

ఆహ్లాదకర వాతావరణం

ధ్వజస్తంభం వెనుక నుంచి సెలయేరుల సవ్వడులు వినిపిస్తాయి. చుట్టూ గుట్టలు, మధ్య లోయ, పెద్ద వృక్షాలు, నల్లని భారీ బండలు. పక్షుల కిలకిల రావాలు. ఇక్కడి ప్రకృతి రమణీయతకు భక్తులు పరవశించి పోతారు.

సప్త గుండాలు

ఇక్కడి సప్త గుండాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎంతటి కరువు కాటకాల్లో అయినా నీటిధార ఎండక పోవడం విశేషం. రుషిగుండం నుంచి ప్రారంభమైన జలధార ఆరు గుండాలమీదుగా ప్రవహిస్తుంది. పక్కనే మహావృక్షం. మొత్తం పది (మద్ది, మర్రి, వేప, రావి, జీడి, టేకు, రేగి వంటి) జాతుల చెట్లతో మిళితమైంది. దీని వేర్లు రుషిగుండం వరకూ వ్యాపించాయి. ఈ చెట్టుచుట్టూ 108 ప్రదక్షిణలు చేసి, రీల్ దారం చుడితే కోరికలు సిద్ధిస్తాయన్న నమ్మకమూ ఉంది.

ఆవుమూతి గుండంలోని నీటిని పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయనీ భక్తులు విశ్వసిస్తారు. స్నానగుండంలో స్నానాలవల్ల పాపాలు పోతాయంటారు. శివతీర్థ గుండం నీటితోనే శివుడికి అభిషేకం చేస్తారు. లింగాన్ని అభిషేకించిన పాలు, పంచామృతం నేరుగా పాలగుండంలోకే చేరుతుంది. ఇక, గుడికి ఉత్తరం వైపున్న సూర్య గుండాల జలాలు వేడిగా, చల్లగా ఉండటం గొప్ప విశేషం. కాగా, ఆలయ పరిసరాల్లోని ధ్యాన మండపం చాళక్యుల కాలంలో నిర్మితమైందిగా తెలుస్తున్నది. దీని లోపల 24 ఖానాలు ఉంటాయి.

పెరుగుతున్న రాకపోకలు

కదిలి అలయం లోయ ప్రాంతంలో ఉండడం వల్ల మొదట్లో కరెంటు ఉండేది కాదు. 1997లో స్థానిక భక్తుల పూనికతో అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. ప్రతీ శావణమాసం నెల రోజులు, శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఆలయంలో గోశాల ఏర్పాటు చేశారు. తెలుగు వారితోపాటు మహారాష్ట్ర నుంచీ భక్తుల రాకపోకలు పెరుగుతున్నాయి. ఎండోమెంట్స్ వారి పర్యవేక్షణలో ఆలయ నిర్వహణ జరుగుతున్నది. పాలక మండలిని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది.

- రామేశ్వర్, 

విజయక్రాంతి, నిర్మల్