కల్వకుర్తికి ఆధ్యాత్మిక శోభ
విశ్వశాంతి మహాయాగ మహోత్సవం ప్రారంభం
కల్వకుర్తి జులై 19 : కల్వకుర్తి పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది. పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ గ్రౌండ్లో ఆదివారం నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు నిర్వహించనున్న విష్ణు పంచాయతనం, ఆయుధ చండీ, అతిరుద్రం 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
సుమారు 16 రోజుల పాటు కొనసాగే ఈ మహాయాగంలో కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వారి ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం 6 నుంచి రాత్రి వరకు పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల, కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు బాలాజీ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విశ్రాంతి, భోజన ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి అన్నప్రసాదం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాయాగాన్ని విజయవంతం చేసేందుకు పట్టణ ప్రజలు, భక్తులు, సేవాదళ సభ్యులు సమన్వయంతో పనిచేస్తున్నారు. పట్టణమంతా విద్యుత్ దీపాల అలంకరణలు, దేవతామూర్తుల చిత్రాలతో సుందరంగా ముస్తాబై ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జూలూరు రమేష్బాబు, ఆనంద్ కుమార్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






