ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా

28-08-2026 | 01:21pm

మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌(Collectorate) ఎదుట మహాధర్నా నిర్వహించారు. జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వందలాదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ గవినోళ్ల రాజీవ్‌రెడ్డి, కన్వీనర్ ఎస్. విజయ్‌కుమార్ మాట్లాడుతూ రెండో పీఆర్‌సీ ప్రకటించకపోవడం, ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటం, ఉద్యోగుల బకాయిలు విడుదల చేయకపోవడం, సీపీఎస్‌ను రద్దు చేయకపోవడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగుల ఆరోగ్య కార్డులను కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు చేయాలని, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలని కోరారు. జీవో 25 ద్వారా ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో దూర ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1న సీపీఎస్‌ రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, సెప్టెంబర్ 10న హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌లో ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ధర్నా అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) హరిప్రియకు అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.b

మరిన్ని వార్తలు