15 April, 2026 | 3:16 AM

క్రీడలు స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయి

15-04-2026 12:00 AM

కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

గద్వాల టౌన్, ఏప్రిల్ 14: క్రీడలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకే కాక అందరిలో స్నేహ సంబంధాలను పెంపొందించడానికి దోహదపడతాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

ఎస్జిటియు (సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్) జోగులాంబ గద్వాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు గద్వాల ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన టిపిఎల్ (టీచర్స్ ప్రీమియం లీగ్) క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విజేతలకు మంగళవారం నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు మొదటిసారి ఈ క్రీడల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, తాము నేర్చుకున్న క్రీడా నైపుణ్యాలను తమ పాఠశాలలోని విద్యార్థులకు నేర్పించాలని సూచించారు. 200 మంది క్రీడాకారులకు 12 టీములుగా క్రికెట్ మ్యాచ్ లను సమర్ధవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

అనంతరం క్రికెట్ పోటీల విజేతగా నిలిచిన గట్టు గేమర్స్ జట్టుకు రూ. 20 వేల చెక్కు, రన్నర్స్ గా నిలిచిన గద్వాల గ్లాడియేటర్స్ జట్టుకు రూ.15 వేల చెక్కు తో పాటు పతకాలు, ట్రోఫీలను కలెక్టర్ అందజేశారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు కూడా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఈవో విజయలక్ష్మి, ఇన్చార్జి డి వై ఎస్ ఓ రామలింగేశ్వర్ గౌడ్, వివిధ మండలాల విద్యాధికారులు, ఇతర అధికారులు, ఎస్జిటియు నేతలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.