24 April, 2026 | 1:52 AM

భువికి గంగను రప్పించిన మహనీయుడు శ్రీ భగీరథ మహర్షి

24-04-2026 12:00 AM

నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి

వనపర్తి, ఏప్రిల్ 23 ( విజయక్రాంతి ) : కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన మహనీయుడు శ్రీ భగీరథ మహర్షి అని నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి కొనియాడారు. గురువారం శ్రీ భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని స్థానిక భగీరథ చౌరస్తాలో ఏర్పాటుచేసిన వేడుకలకు నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి ముఖ్యఅతిథిగా హాజరుకాగా, ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీ భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఐ డి ఓ సి ఆవరణలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భగీరథ మహర్షి జయంతి వేడుకలకు సైతం హాజరై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎవరైనా కష్టపడి పట్టుదలతో అనుకున్నది సాధిస్తే.. వారిని భగీరథునితో పోలుస్తారని, కఠోర శ్రమ చేసి దేన్నైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశాడని కొనియాడుతారని తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ భగీరథ మహర్షి మహాజ్ఞాని అని, పరోపకారానికి, దీక్షకు, సహనానికి ప్రతిరూపమని ఎంత కష్టాన్నైనా లెక్కచేయకుండా అనుకున్నది సాధించే వారని అన్నారు. భగీరథ జయంతి సందర్భంగా సగరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, డిసిసిబి మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు, సగర సంఘం నాయకులు, కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.