భక్తులతో కిటకిటలాడిన శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం
వేములవాడ, జూన్ 28 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి, కోడె మొక్కులు చెల్లించడంతో పాటు రుద్రాభిషేకం, అన్నపూజ, నిత్య కల్యాణం, చండీ హోమం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, కుంకుమ పూజలు తదితర సేవల్లో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో శ్రీమతి రమాదేవి ఏర్పాట్లను పరిశీలించారు. క్యూలైన్లలో ఉన్న భక్తులను, చిన్నపిల్లలను, వృద్ధులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు.
కోడెమొక్కులు చెల్లించే భక్తులకు ఈవో ప్రత్యేక సూచనలు చేశారు. కోడెలపై పసుపు, కుంకుమ చల్లరాదని, వాటిలో ఉండే రసాయనాల వల్ల కోడెలకు చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. దారాలతో కట్టిన పూలదండలను కోడెల మెడలో వేయకూడదని, వాటిని తినిపించరాదని భక్తులకు సూచించారు. ఆలయ అధికారులు, సిబ్బంది భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు.






