calender_icon.png 4 May, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలంబో విమానంలో సోదాలు

03-05-2025 08:01:53 PM

కొలంబో,(విజయక్రాంతి): ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడితో సంబంధం ఉన్న అనుమానితులు చెన్నై నుంచి కొలంబో వెళ్లిన విమానంలో ఉండవచ్చని సమాచారం అందడంతో శ్రీలంక పోలీసులు  తనిఖీ నిర్వహించారు. చెన్నై నుంచి కొలంబో చేరుకున్న జాతీయ విమానయాన సంస్థ శ్రీలంక ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తమ విమానం బండరానాయకే అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం 11:59 గంటలకు చేరుకుందని, తర్వాత సమగ్ర భద్రతా తనిఖీకి గురైందని తెలిపింది. భారతదేశంలో వాంటెడ్ గా ఉన్న ఆరుగురు అనుమానితులు యూఎల్ 112 విమానంలో ప్రయాణిస్తున్నట్లు భారత్ అధికారులకు చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ నుండి హెచ్చరిక వచ్చింది. 

ఈ నేపథ్యంలో శ్రీలంక పోలీసులు, శ్రీలంక వైమానిక దళం, విమానాశ్రయ భద్రతా సిబ్బంది సమన్వయంతో ఈ సోదాలు నిర్వహించారు. విమానంలోని ప్రయాణికులు, వారి లగేజీతో పాటు విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, తదుపరి కార్యకలాపాలకు అనుమతి ఇచ్చామని, గంటల తరబడి జరిపిన తనిఖీల్లో ఎటువంటి అనుమాతులు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ లభ్యం కాలేదని శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. పహల్గామ్‌లో జరిగిన మారణహోమం వెనుక ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నారని, వారిలో ముగ్గురు పాకిస్తానీ జాతీయులు ఉన్నారని భారత అధికారులు గుర్తించారు.

పహల్గామ్ ప్రాంతంలోని బైసరన్ లోయ వద్ద ఏప్రిల్ 22న పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడిలో 26 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడి వెనుక ఉన్న ఉగ్రవాదులను, వారి ఊహకు అందని కుట్రలో భాగమైన వారిని శిక్షిస్తామని ఏప్రిల్ 24న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిజ్ఞ చేశారు. దేశ శత్రువులు నిరాయుధులైన పర్యాటకులను మాత్రమే కాకుండా భారతదేశ ఆత్మపై దాడి చేయడానికి ధైర్యం చేశారని చెప్పారు.ఏప్రిల్ 29న ఉన్నత స్థాయి రక్షణ అధికారులతో జరిగిన సమావేశంలో ఉగ్రవాద దాడికి భారతదేశం స్పందించే విధానం, లక్ష్యాలు, సమయాన్ని నిర్ణయించడానికి సాయుధ దళాలకు పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ ఉందని మోడీ చెప్పారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.