ధర్మ స్వరూపుడు.. శ్రీరామచంద్రుడు
చైత్ర మాసపు శుక్ల పక్షాన, పునర్వసు నక్షత్రాన కర్కాటక లగ్నంలో అయోధ్య నగరాన ధర్మమూర్తి అవతరించిన పవిత్ర వేళ శ్రీరామనవమి. వసంత రుతువులో ప్రకృతి పరవశించే సమయాన, లోకానికి ఆదర్శాన్ని చాటిచెప్పడానికి విష్ణుమూర్తి రాముడిగా జన్మించిన ఈ పండుగ భారతీయులకు అత్యంత పూజనీయం. సత్యం, ధర్మం, వినయం, త్యాగం వంటి గొప్ప విలువలకు ప్రతిరూపమైన రాము డి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాం. ఈ ఏడాది మార్చి 27వ తేదీన మనం ఈ వేడుక జరుగనుం ది. ఇది కేవలం ఒక దేవుడి ప్రార్థన మా త్రమే కాదు, మానవ జన్మ ఏ విధంగా ఉండాలో నేర్పిన ఒక పరిపూర్ణ పురుషుని స్మరణ. జగదభిరాముడు శ్రీరాముడే అంటూ రామకథను వినడం మనందరికీ ఎంతో ఇష్టం.
అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆయనకు కలిగిన నలుగురు కుమారుల్లో పెద్దవాడు రాముడు. రాముడు ధర్మస్వరూపుడు. అందుకే తల్లిదండ్రులు మగపిల్లలకు ర’, ’రా’ అక్షరాలతో పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. హిం దూ పండుగల్లో శ్రీరామనవమికి ఒక ప్రత్యేకత ఉంది. త్రేతాయుగంలో అయోధ్యలో శ్రీరామచంద్రుని ఆవిర్భావాన్ని ఈ పర్వదినం స్మరిస్తుంది. వీరత్వం, నైతికత, సుపరిపాలన, వినయం, త్యాగాలను ప్రతిబింబించే అనేక లీలలను రాముడు తన జీవితం ద్వారా లోకానికి చాటిచెప్పాడు.
భారతదేశపు పురాతన గ్రంథాలన్నీ విష్ణువు వివిధ రూపా ల్లో అవతరించి భక్తులను కాపాడుతాడని, దుష్టులను శిక్షిస్తాడని చెబుతున్నాయి. దీనిలో భాగంగానే ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో భగవంతుడు మానవ రూపంలో జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. రామనవమికి ముందు చైత్ర నవరాత్రి సమయంలో తొమ్మిది రోజుల పాటు హిందువులు ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో నిష్టగా ఉండి, కేవలం సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడమే కాక, మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. తొమ్మిదవ రోజున అయోధ్యతో పాటు దేశంలోని అన్ని నగరాలు మండపాలతో ముస్తాబవుతాయి.
రాముడి జీవితంలోని ప్రతి అడుగును ఈ రోజున భక్తులు గుర్తుచేసుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరికొందరు విష్ణువు అవతారమైన రాముడు స్వర్గం నుంచి శిశు వు రూపంలో ఈ గడ్డపైకి దిగివచ్చాడని నమ్ముతారు. ఈ రోజున ప్రజలు దేవాలయాలను సందర్శించి ఆశీస్సులు పొందుతారు. అయోధ్య వంటి చోట్ల రాముడి చిన్న విగ్రహాలను ఊయల మీద ఉంచి ఊరేగింపులు చేస్తారు. చాలా దేవాలయా ల్లో అగ్నికి సంబంధించిన హవనం నిర్వహిస్తారు.
రాము డు రావణుడిని ఓడించిన ఘట్టాన్ని రామలీల పేరుతో నాటక రూపంలో ప్రదర్శిస్తారు. సం స్కృతిలో ఇది ముఖ్య భాగం. ఈ పండుగ దేశవ్యాప్తంగా జరిగినా అయోధ్య, భద్రాచలం, రామేశ్వరం వంటి ప్రాంతాల్లో వేడుకలు అంబరాన్నంటుతాయి. రాముడితో పాటు సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుని కూడా భక్తితో భక్తులు పూజిస్తారు. ప్రతి గ్రామంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరుగుతుంది. జై శ్రీరామ్ నినాదాలతో పరిసరాలన్నీ మారుమోగుతాయి. తెలం గాణలోని భద్రాచలం, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం ఘనంగా నిర్వహిస్తారు. ప్రభుత్వం తరపున పాలకులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
కామిడి సతీష్‌రెడ్డి, సెల్: 98484 45134




