పౌష్టికాహారం పిల్లల హక్కు
పిల్లల తిండిపై గరికపాటి వ్యాఖ్యలు సిగ్గుచేటు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనమనేది కేవలం ఒక పథకం కాదు, అది వారి ప్రాథమిక హక్కు. నిరుపేద విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తూ వారిని విద్యావంతులను చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని అపహాస్యం చేస్తూ, విద్యార్థులు కేవలం భోజనం కోసమే బడికి వస్తున్నారనే ధ్వని వచ్చేలా మాట్లాడటం తగదు.
‘బడుల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైపోయింది. చదువు మిథ్యాహ్నమైపోయింది. చదువు ఎవరికీ అక్కర్లేదు. భోజనంలో గుడ్డు పెట్టారా? గాడిద గుడ్డెట్టెరా? అన్నం తినే వాడికి కోడుగుడ్డు పెట్టడేమెంటి ? అసలు బుద్ధుందా ? పిల్లలను అన్నం తెచ్చుకోమనండి. లేదంటే.. చదువు మానేయమని చెప్పండి. భోజనం పెట్టి, బట్ట లిచ్చి, యూనిఫారం ఇచ్చి.. ఇక చదువుకోమంటే చదువుకుంటారా? శోభనపు పెళ్లి కొడుకులా మంచమెక్కి కూర్చుంటాడు’ ఇవి ప్రముఖ ప్రవచనకారుడు, అవధాని గరికపాటి నరసింహారావు ఇటీవల ఓ వేదికపై అన్న మాటలు.
పిల్లల తిండిపై గరికపాటి వ్యాఖ్యలు సిగ్గుచేటు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనమనేది కేవలం ఒక పథకం కాదు, అది వారి ప్రాథమిక హక్కు. నిరుపేద విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తూ వారిని విద్యావంతులను చేయాలనే ప్రభుత్వ సం కల్పాన్ని అపహాస్యం చేస్తూ, విద్యార్థులు కేవలం భోజనం కోసమే బడికి వస్తున్నారనే ధ్వని వచ్చేలా మాట్లాడటం గరికపాటి వంటి మేధావులకు ఏమాత్రం తగదు. ఈ మాటలు ఎందరో నిరుపేద తల్లిదండ్రుల మనసులను తీవ్రంగా గాయపరిచాయి. ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు పాలు, రాగిజావ వంటి మెరుగైన పోషకాలను అందించాలని ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు పోతుంటే, ఇలాంటి విమర్శలు రావడం విచారకరం.
పురాణాలు ఇవే చెప్పాయా?
మహాభారత, రామాయణ ఇతిహాసాల పై పట్టు సాధించి సమాజానికి హితబోధ చేసే గరికపాటికి మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వానికి ఆర్థిక భారంగా, ఉపాధ్యాయులకు పని భారంగా చిత్రీకరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవానికి ఈ పథ కం ప్రవేశపెట్టిన తర్వాత పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరగడమే కాకుండా, మధ్యలో బడి మానేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ విద్యాబోధనకు ఆటంకం కలుగుతుందని ఆయన భావిస్తే, ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని ప్రభుత్వానికి సూచిస్తే అందరూ సంతోషించేవారు.
అలా కాకుండా పిల్లలకు ఇచ్చే గుడ్డును ‘గాడిద గుడ్డు’ అని సంబోధించ డం వల్ల ఆయనపై సమాజంలో ఉన్న గౌరవ మర్యాదలు ఒక్కసారిగా అట్టడుగు కు పడిపోయాయి. పెరుగుతున్న వయసు రీత్యా ఆయనకు ఆత్మజ్ఞానం లోపించిందా లేక కింది కులాల పట్ల ఉన్న వివక్ష ఇలా బయటపడిందా..? అనే జనబాహుళ్యం నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధంలో బాధలో ఉన్న అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేసినట్లు, విద్యావంతుడైన అవధాని గారికి కూడా ఎవరో ఒక రు వ్యవస్థలు, చట్టాల అవసరాల గురించి ప్రబోధించాలేమో అనిపిస్తోంది.
విజ్ఞత ఏమైంది?
మన చుట్టూ పరిస్థితులు ఎప్పుడూ ఒకే లా ఉండవు. ఒక్కోసారి మన గౌరవానికి, మనుగడకే ఇబ్బందులు తెచ్చిపెడతాయి. గరికపాటి పరిస్థితి ఇప్పుడు అలాగే తయారైంది. వేదిక మీద కూర్చుని ఏది మాట్లాడి నా చెల్లిపోతుందని అనుకోవడం పొరపా టు. జనం మధ్యకు వచ్చి చూస్తేనే వాస్తవా లు అర్థమవుతాయి. డబ్బు కేవలం అనుభూతిని ఇస్తే, పేదరికం అనుభవాన్ని ఇస్తుంది. ఈ రెండూ కాకుండా విద్యతో వచ్చిన అనుభవం గరికపాటికి ఇక్కడ ఎం దుకు పనిచేయలేదో అర్థం కావడం లేదు.
పుక్కిట పురాణాలు చెప్పే ఆయన మాట ల్లో వెనుకబడిన వర్గాల లేమిడితనం పట్ల ఒక రకమైన లెక్కలేనితనం స్పష్టంగా బయటపడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారి టీ వర్గాల్లో ఉన్న పేదరికం, వారి తరతరాల విద్యాహీనతను ఆయన నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆయన కుటుంబంలో తరతరాలుగా ఉన్న విద్యా నేపథ్యం వల్లనే నేడు ఈ వయసులో కూడా ప్రవచనాలు చెబుతూ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. కానీ, ఏ ఆధారం లేని నిరుపేద పిల్లలకు విద్యతో పాటు కనీస ఆహారం అందుతుంటే, దానిపై విజ్ఞ త లేకుండా మాట్లాడటం విజ్ఞత అనిపించుకోదు.
దళిత, గిరిజన వెనుకబడిన కులాల పిల్లలకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యం తో 1995 ఆగస్టు 15న ఈ పథకాన్ని అప్ప టి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రారంభించింది. దీనిని నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి నేడు ప్రధాని పోషణ్ శక్తి నిర్మాణ్‌గా మార్చారు. తరగతి గదిలో ఆకలిని దూరం చేసి విద్యను దగ్గర చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. హాజరు శాతం పెంచడం, డ్రాపౌట్స్ నివారించడం ద్వారా అట్టడుగు వర్గాలకు చదువును అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
అన్నదాన కార్యక్రమం కాదు..
మధ్యాహ్న భోజనం అనేది ప్రభుత్వా లు ఉదారంగా పెట్టే అన్నదాన కార్యక్రమం కాదు, అది వారి ప్రాథమిక హక్కు అని విజ్ఞులు గుర్తించాలి. తన ప్రవచనాలతో ఎందరికో ఆదర్శంగా నిలిచిన గరికపాటి లాంటి వారు సరదాకు కూడా నిరుపేద విద్యార్థుల మౌలిక సదుపాయాలపై అలా మాట్లాడి ఉండకూడదు. ఎన్ని చదువులు చదివినా, ఎంత విజ్ఞానం ఆర్జించినా ఆత్మతత్త్వం తెలుసుకోలేని మనిషి ఎందుకనే వేమన పద్యం ఇక్కడ అక్షరాలా వర్తిస్తుంది. సమాజం అంతటి మేధావి వైపు వేలెత్తి చూపేలా ప్రవర్తించడం సరికాదు.
విద్యలో ఉన్నత ప్రమాణాల కోసం ఆయన ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి, పేద వర్గాల పిల్లలకు మంచి మార్గం చూపాలి. అప్పుడే పది మంది మనసుల్లో ఆయన స్థానం పదిలమై ఉంటుంది. అంతేకానీ. ఒకవైపు ప్రవచనాలు వల్లె వేస్తూ ఇప్పుడు పేదల విద్యా సౌకర్యాలపై చెణుకులు విసిరితే జనం నొచ్చుకుంటారని గ్రహించాలి. నిజంగానే నోరు జారి తప్పు దొర్లితే, ఆత్మసాక్షిగా క్షమాపణ కోరడంలో తప్పులేదు. అది ఆయన గౌరవాన్ని మరింత పెంచుతుందే తప్ప తగ్గించదు. ఇప్పటికైనా వాస్త వాలను గ్రహించి, పేద విద్యార్థుల హక్కులను గౌరవించడం ఆ అవధానికి శ్రేయస్కరం.
వ్యాసకర్త సెల్: 80082 00664
ధీరన్ కొడారి




