అంతులేని యుద్ధం
పశ్చిమాసియాలో యుద్ధం మొదలై మూడు వారాలు దాటుతున్నా, కనుచూపు మేరలో శాంతిచర్చలకు తావు కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ ఏమాత్రం ఊహించని రీతిలో ఇరాన్ యుద్ధంలో దూసుకు పోతున్నది. తమ అత్యున్నత నాయకుడు ఖమేనీని అత్యంత దారుణంగా మట్టుపెట్టినందుకు ప్రతీకారంతో రగిలిపోతున్నది. కొత్త కొత్త యుద్ధతంత్రాలను రచిస్తున్నది. రణరంగంలో ఆ దేశానిదే పైచేయి అనేది స్పష్టంగా కనిపిస్తున్నది.
యుద్ధం ఆరంభంలో ఆర్భాటం చేసిన ట్రంప్ దివాళాకోరుతనం ఇప్పుడు బయటపడింది. నాటో దేశాలు, యూరోపియన్ యూనియన్ సైతం ఆయన ఏకపక్ష నిర్ణయాలను సహించడం లేదు. ఇతర మిత్రదేశాల నుంచి కూడా మద్దతు కరువైంది. ట్రంప్ అనుసరిస్తున్న అస్థిర వైఖరి వల్ల అగ్రరాజ్యం తన మిత్రదేశాల నమ్మకాన్ని కూడా కోల్పోతున్నది. అమెరికన్ సైన్యం సముద్ర జలాల్లో చిక్కుకుపోయి ఇరాన్ దాడులను ఎదుర్కోలేక చతికిల పడింది. వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నా ట్రంప్ తన ప్రగల్భాలను మాత్రం పక్కన పెట్టడం లేదు.
ఒకవైపు ఇరాన్ స్వయంగా శాంతి చర్చలు కోరుతోందని చెబుతూనే, తనను తమ దేశ అత్యున్నత లీడర్‌గా ఉండమని కోరుతున్నదని కూడా ప్రకటించారు. ఆ వ్యాఖ్యలను చూసి యావత్ ప్రపంచమే నవ్వుకుంటున్నదనేది వాస్తవం. యుద్ధం ముగియాలంటే ఇరాన్ 15 కఠినమైన షరతులకు అంగీకరించాలని ట్రంప్ ఇటీవల హుకుం జారీ చేశారు. తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని, క్షిపణి వ్యవస్థను అంతర్జాతీయ పర్యవేక్షణకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
అయితే, ఈ షరతులకు తలొగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా తన సైన్యాన్ని పశ్చిమాసియా నుంచి పూర్తిగా ఉప సంహరించుకోవాలని, ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను తక్షణం ఎత్తివేయాలని ఎదురు షరతులు విధించింది. ఇరుపక్షాల వైఖరితో యుద్ధం అంతకంతకు వీడని చిక్కుముడిలా మారింది. హొర్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ప్రపంచ ఇంధన సరఫరాను ఇరాన్ తన అదుపులోకి తెచ్చుకున్నది. దీంతో ఆసియా, ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది.
అమెరికా, ఇరాన్ అంతకంతకూ ప్రతిష్ఠకు పోతుండటంతో మధ్యవర్తిత్వం చేసేందుకు ఏ దేశం ముందుకు వచ్చినా సత్ఫలితాలు రావడం లేదు. అయినప్పటికీ, ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, యుద్ధానికి ముగింపు పలికేందుకు అంతర్జాతీయ స్థాయిలో కొన్ని దేశాలు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఖతార్ ఆ ప్రయత్నాల్లో ముందు వరుసలో ఉన్నది. రెండో స్థానంలో ఒమన్ నిలుస్తున్నది. అమెరికాకు, ఇరాన్‌కు మధ్య వారధిలా ఉంటూ శాంతి నెలకొల్పేందుకు ఆ రెండు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇరాన్‌లో అమెరికాకు అధికారిక రాయబార కార్యాలయం లేని కారణంగా, స్విట్జర్లాండ్ అక్కడ అమెరికా ప్రయోజనాలను పర్యవేక్షిస్తూ సమాచార మార్పిడికి కేంద్రంగా నిలుస్తోంది. హొర్ముజ్ జలసంధి గుండా ప్రపంచ వాణిజ్యానికి విఘాతం కలగకుండా ఐరాస నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే అమెరికా తన అహంకారాన్ని వీడి ఇరాన్ స్వతంత్రతను గుర్తించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఈ యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక మాంద్యానికి, కోలుకోలేని ప్రాణ నష్టానికి దారి తీయడం ఖాయం. అగ్రరాజ్యం తన పొరపాటును గ్రహించి వెనక్కి తగ్గకపోతే, చరిత్రలో ఈ యుద్ధం ఒక పెద్ద వైఫల్యంగా మిగిలిపోతుంది.




