అంతా మాస్ కాపీయింగే...
చెప్పని తరగతులకు పరీక్షలు...చూచి రాతలకు రూ. 2 వేలు వసూలు..?
మంచిర్యాల, జూన్ 29 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లాలో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతుంది. లక్షెట్టిపేట డిగ్రీ, ఫిజిక్ కళాశాలలో ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ (ఎస్ డి ఎల్ సి ఈ) పీజీ మొదటి సంవత్సరం మొదటి సెం పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షా కేంద్రంలో వివిధ స్టడీ సెంటర్లకు సంబంధించిన విద్యార్థులు 250 మంది ఈ పరీక్షలను రాస్తున్నారు. స్టడీ సెంటర్లలో తరగతులు నడవకపోవడం, కనీసం ఏ సబ్జెక్టులో ఏం సిలబస్ ఉందో కూడా తెలియని దుస్థితిలో విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండడం, తరగతులు చెప్పని సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తుండడంతో విద్యార్థులు చిట్టీలు, బుక్కులు పెట్టి మాస్ కాపీయింగ్ పాల్పడుతున్నారు.
ఇదంతా కళాశాల అధ్యాపక బృందం ఆధ్వర్యంలోనే జోరుగా సాగుతుంది. కళాశాల ప్రిన్సిపల్ తోపాటు పరీక్షల కోఆర్డినేటర్ లు స్టడీ సెంటర్ ఇన్చార్జిల నుంచి ఒక్కో విద్యార్థికి పరీక్షకు 2000 రూపాయల చొప్పున వసూలు చేసి మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది. పరీక్ష కేంద్రం ఆవరణ మొత్తం మాస్ కాపీయింగ్ కు ఉపయోగించిన చిట్టిలు, పుస్తకాలు దర్శనమిస్తున్నాయి అంటే ఎంత పెద్ద మొత్తంలో మాస్ కాపీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో విద్యార్థికి రూ. 2 వేల చొప్పున 250 మంది విద్యార్థుల వద్ద పరీక్షకు సుమారు ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ వసూలు తతంగం మొత్తం స్టడీ సెంటర్ ఇన్చార్జుల బాధ్యతే. విద్యార్థుల వద్ద వసూలు చేసిన డబ్బులను రహస్యంగా కళాశాల ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ ద్వారా ప్రిన్సిపాల్, ఇతర అధ్యాపకులకు ముట్ట చెబుతున్నారు. పైసా కొట్టు చిట్టి పెట్టు అనే స్కీమ్ ఇక్కడ జోరుగా సాగుతుంది. గతంలో కూడా లక్షట్ పేట పీజీ కళాశాలలో ప్రిన్సిపల్, అధ్యాపకుల తప్పిదం వల్ల ఒక బ్యాచ్ బ్యాచ్ కు ఒక పరీక్షకు బదులు మరో పరీక్ష రాసి ఫెయిల్ అయినా విషయం విదితమే. ఎక్కడలేని తప్పిదాలు ఇక్కడ జరుగుతున్న సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి.






