calender_icon.png 3 February, 2026 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నుల పండుగగా శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ కళ్యాణం

03-02-2026 07:47:34 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూరు మండల కేంద్రంలోని శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయంలో జరుగుతున్న జాతర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కల్యాణాన్ని తిలకించేందుకు భిక్కనూరు మాత్రమే కాకుండా పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేద బ్రాహ్మణులు కొడకండ్ల నవీన్ శర్మ, పెద్దెడ్ల జయప్రకాష్ శర్మ, పొన్నాల సాయి శర్మ మంత్రోచ్ఛారణల నడుమ జమదగ్ని మహర్షి రేణుకాదేవి ఎల్లమ్మ అమ్మవారి మెడలో మూడు ముళ్లు వేసి సంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని నిర్వహించారు.

కల్యాణం అనంతరం మహిళలు మంగళహారతులతో అమ్మవారికి ఓడి బియ్యం పోసి కట్న కానుకలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. కల్యాణం ఆలస్యంగా ప్రారంభం కావడంతో దర్శనార్థం మహిళలు క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని పుష్పాల అలంకరణతో పాటు రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా సజ్జీకరించారు. అంతకుముందు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీగా అన్నప్రసాద వితరణ కూడా నిర్వహించడంతో ఉత్సవాలు మరింత ఘనంగా సాగాయి. భక్తుల జయజయధ్వానాల మధ్య జరిగిన ఈ కల్యాణం భిక్కనూరులో ఆధ్యాత్మిక శోభను మరింత పెంచింది.