calender_icon.png 3 February, 2026 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రసవత్తరం బాన్సువాడ 'పుర' రాజకీయం

03-02-2026 07:44:04 PM

బస్తీ మే సవాల్... గల్లీలో లీడర్లు

మొదలైన ఓట్ల దండాలు

ఓటర్లతో మాట మంతి

బస్తీల్లో అమాత్యుల పర్యటన

బాన్సువాడలో పోచారం, బాజిరెడ్డి, ఎండల పాదయాత్రలు

బాన్సువాడ,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలతో బరిలోకి దిగే అభ్యర్థులు బస్తీమే సవాలంటున్నారు. అమి తుమి తేల్చుకునేందుకు పోటా పోటీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. పార్టీ పెద్దల ఆశీర్వాదం కోసం వెంపర్లాడుతున్నారు. పార్టీ అభ్యర్థితో తమకే దక్కాలని రహస్య కలయికలకు అవకాశం కల్పిస్తున్నారు. బస్తీలో ఉన్న తమ ఓట్ల మద్దతు అంశాన్ని ప్రస్తావనకు తెచ్చి పార్టీ బి-ఫాం తమకే లభించినట్లు వేడుకుంటున్నారు. బాన్సువాడలో  'పుర' రాజకీయం రసవత్తరంగా మారుతుంది.

పార్టీల ముఖ్య నేతలు బరిలోకి దిగే ఆశావావులతో పాటు, ఆయా పార్టీ నాయకులతో సమావేశాలతో సందడి చేస్తున్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీ నేతలు మున్సిపల్ ఎన్నికల సమరానికి జై కొడుతున్నారు. ప్రధానంగా చైర్మన్ పీఠాన్ని అధిరోహించేందుకు వ్యూహాత్మక ధోరణిని ఆలంబించే చర్యకు కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. అందుకోసం రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ మున్సిపల్ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో... పట్టణంలో ఉన్న 19 వార్డులను ఎలా మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలో... అన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు.

రంగంలోకి హేమాహెమీలు

బాన్సువాడ  మున్సిపల్ చైర్మన్ పీఠంపై అధికార పక్షం, ప్రతిపక్షాలు ప్రత్యేక నజర్  పెట్టాయి. స్థానిక సంస్థల ఎన్నికల నుండి మొదలైన ముఖ్య నేతల రాజకీయాలు మున్సిపల్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపనున్నాయి. ఎలాగైనా తాము ఎంపిక చేసుకున్న వ్యక్తికి చైర్మన్ పీఠా న్ని అప్పజెప్పాలని ఎన్నికలను సవాల్ గా తీసుకుంటున్నారు. పట్టణంలోని 19 వార్డులలో 10 వార్డులను గెలుచుకున్న పార్టీకే చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది.

మొత్తం 19 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని తమ సత్తాను చాటుకోవాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేశారు.బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాజిరెడ్డి గోవర్ధన్, బిజెపి పార్టీ ఇన్చార్జి ఎండల లక్ష్మీనారాయణలు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. పుర పోరును తమ తమ వ్యక్తిగత రాజకీయాల వైపుకు తీసుకెళ్లి విమర్శలు ప్రతి విమర్శలకు దిగుతున్నారు. ఈసారి బాన్సువాడ చైర్మెన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో మహిళనే పీఠంపై కూర్చునే అవకాశం ఉంది.

అధికార కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు సతీమణి , గులాబీ పార్టీ నుండి జుబేర్ సతీమణి పేరును ఆ పార్టీ నేతలు ఖరారు చేశారు. బిజెపి పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థి ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు చైర్మన్ అభ్యర్థి ఎవరన్న విషయంలో తర్జన భ ర్జన  పడుతున్నారు. చైర్మన్ అభ్యర్థితో పాటు వార్డుల అభ్యర్థులను బరిలోకి దింపే విషయంలో కూడా ఆచితూచి అడుగేస్తున్నారు. ముగ్గురు ముఖ్య నేతలు బాన్సువాడ వైపు దృష్టి పెట్టడంతో మున్సిపల్ ఎన్నికలు ఈసారి ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.

ఆశావాహుల్లో కుమ్ములాటలు

 పట్టణంలోని 19 వార్డుల్లో రిజర్వేషన్ ప్రకారం పోటీలోకి దిగే ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వార్డుల్లో పలుకుబడి ఉన్న, లేకపోయినా.. రిజర్వేషన్ ని ప్రమాణికంగా తీసుకొని పోటీ చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. అవార్డులలో బరిలోకి దిగి గెలుపొందేందుకు గత కొంతకాలంగా ప్రజలతో మమేకమై పని చేస్తున్న అభ్యర్థులకు తలనొప్పిగా మారుతుంది. పార్టీ తరఫున ఒకరికి బీఫామ్ అందించే అవకాశం ఉండగా, ముగ్గురు నలుగురు అభ్యర్థులు తమకే కావాలంటూ పట్టుబట్టడంతో వారి మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి.

ఎవరికివారు తమ బలాబలాలను చూపించుకునేందుకు ముఖ్య నేతల వద్ద అంగ,దన ప్రదర్శనకు దిగిన ఒకవేళ బీఫామ్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా ఉండేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఇంతకాలం ఆయా వార్డులపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులకు రిజర్వేషన్లు నిరాశను కలిగించగా, వారు ఇతర వార్డుల్లో పోటీ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది.