బ్రహ్మోత్సవాలకు ఉమామహేశ్వరం ఆలయం సిద్ధం
* 15 నుంచి 22 వరకు వేడుకలు
* భారీగా తరలిరానున్న భక్తులు
అచ్చంపేట: నల్లమల కొండల్లో వెలసిన శ్రీ ఉమామహేశ్వర ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ పరిధిలోని 500 అడుగుల ఎత్తైన నల్లమల కొండపై ఆలయం ఉంది. కొండంతా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. కొండపైనున్న తుమ్మెద మామిడి చెట్టుకింద పరమశివుడు కొలువుదీరి ఉన్నారు. పార్వతిదేవి శివుని కోసం తపస్సు చేసిన ప్రాంతం కావడంతో ఉమామహేశ్వరంగా మారింది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల ఉత్తర ముఖ ద్వారంగా ఆలయం బాసిల్లుతోంది.
కాకతీయుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీరాముడు రావణసుర వధానంతరం శ్రీశైల ప్రదక్షిణము ఈ క్షేత్రం నుంచే ప్రారంభించినట్లు శ్రీశైల పురాణంలో ఉంది. ప్రతీ ఏడాది జనవరి 15 నుంచి 22 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మకర సంక్రాంతి సందర్భంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్సవాలు ఆరంభమవుతాయి. ప్రధాన ఆలయం నుంచి కొద్ది దూరంలో పాపనాశిని ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. ఆలయంకొని ఉమాసదులు, వినాయకుడు, మహిషాసుర మర్ధిణి, అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు.
* భోగమహేశ్వరంలో స్వామి వారి కల్యాణం
ఉమామహేశ్వరం కొండకింది ప్రాంతాన్ని భోగమహేశ్వరంగా పిలుస్తారు. ప్రతీ ఏడాది ఉత్సవాల సందర్భంగా పార్వతిపరమేశ్వరుల కల్యాణోత్సవాన్ని ఆర్చకులు అత్యంత వేడుకగా నిర్వహిస్తారు. మహా ఘట్టాన్నీ తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ర్ట ప్రాంతాలకు చెందిన వేలది భక్తులు తరలివస్తారు. కల్యాణ మండపం సమీపంలో పంచ లింగాల విగ్రహాలు ఉన్నాయి. కొండపైన 11 తీర్థాలు ఉన్నాయి. అందుకే ఆలయాన్ని మహాక్షేత్రంగా కొలుస్తారు.
* 15 నుంచి 22 వరకు ఉత్సవాలు
బ్రహోత్సవాల సందర్భంగా ఆలయంలో రోజుకో విధంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారు రోజుకో వాహనసేవతో తరిస్తారు. ఆలయంలో నిర్వహించే బ్రహోత్సవాల వివరాలు ఇవీ:
14న సాయంత్రం 4 గంటలకు అయ్యప్ప పూజ
15న సాయంత్రం 7 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణము, అగ్నిప్రతిష్ఠాపన, బలిహరణము, నీరాజనము, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగము. రాత్రి 2 గంటలకు ప్రభోత్సవముతో పల్లకిసేవలో కొండకిందకు దిగివస్తారు. తెల్లవారు జామునా 4 గంటలకు భోగమహేశ్వరంలో పార్వతీపరమేశ్వరుల కల్యాణ మహోత్సవం. 16న ఉదయం 6 గంటలకు పల్లకి సేవలో ఉమామహేశ్వరం చేరుట, 9 గంటలకు గవ్యాంత పూజలు, వాస్తుపూజ, వాస్తు హోమము, రుధ్రాభిషేకము, రుద్రహోమము, ప్రాతరౌపాసన, నిత్యబలిహరణ.
సాయంత్రం 4 గంటలకు నీలలోహితపూజ సాయమౌపాసన, బలిహరణము, నీరాజనము, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగం. 17న ఉదయం 9 గంటలకు ప్రాతరౌపాసన, బలిహరణము, నీరాజనము, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగం, సాయంత్రం 4 గంటలకు సాయమౌపాసన, సదస్యం, బలిహరణము, నీరాజనము, అశ్వవాహనసేవ, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగం.
18న ఉదయం 9 గంటలకు గవ్యాంత పూజలు, అమ్మవారికి అభిషేకము, సహస్రనామార్చన, రుధ్రాభిషేకము, రుద్రహోమము. సాయంత్రం 5 గంటలకు సాయమౌపాసన, శ్రీసూక్త, దుర్గా సూక్త హోమములు, నందివాహనసేవ, మ్రుగయాత్ర వినోదము, నీరాజన మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగం. 19న ఉదయం 9 గంటలకు గవ్యాంత పూజలు, రుధ్రాభిషేకము, రుద్రహోమము, అవాహిత దేవత హోమములు, మూర్తి హోమము, శేష హోమము, పూర్ణాహుతి, వసంతోత్సవము, శేషవాహనసేవ, త్రిశూలస్నానం, ధ్వజావరోహణము, పుష్పోత్సవము, ేకాంతసేవ మహాదాశీర్వచనము, పండితసత్కారం.
20 నుంచి 22 వరకు వివిధ రకాల ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఏర్పాట్లు పూర్తి ఛైర్మన్
బ్రహోత్సవాలకు వచ్చే భక్తుల రద్దీని ద్రుష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉత్సవ కమిటీ ఛైర్మన్ భీరం మాధవరెడ్డి, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని అచ్చంపేటతో సహా వివిధ డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుందని చెప్పారు. భక్తులకు అవసరమైన వసతుల కల్పన చేశామన్నారు. వాహనాలను కొండకిందున్న భోగమహేశ్వరంలోనే నిలిపిసేందుకు పార్కింగ్ ప్రాంతాన్ని సిద్ధం చేశామన్నారు. భక్తులు ఉత్సవాలకు సహకరించాలని కోరారు.




