07-08-2025 08:49:49 AM
హైదరాబాద్: యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో(Srushti Fertility Centre Case) పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సరోగసి ముసుగులో శిశు విక్రయాలు జరిగినట్లు పోలీసులు నిర్దారించారు. డాక్టర్ నమ్రత 5 రోజుల కస్టడీ విచారణలో పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. హైదరాబాద్ కేంద్రంగా సుమారు 80 మంది శిశువులు చేతులు మారినట్లు గుర్తించారు. సరోగసీ ముసుగులో శిశువును విక్రయిస్తున్నట్లు నమ్రత అంగీకరించినట్లు సమాచారం. ఎవరి వద్ద పిల్లలను తీసుకున్నామనే వివరాలు గుర్తులేదంటూ నమ్రత సమాధానం చెప్పినట్లు అధికారులు తెలిపారు.
ఎప్పుడో చేసిన తప్పును తనపై రుద్దుతున్నానంటూ పోలీసులతో డాక్టర్ నమ్రత(Doctor Namrata) వాదించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లో బయటకు రాగానే అందరి లెక్కలు తేలుస్తానని అన్నట్లు సమాచారం. సికింద్రాబాద్ లోని గైనకాలజిస్టు లెటర్ పై డాక్టర్ నమ్రత మందులు రాసిచ్చారు. గైనకాలజిస్టు ఫిర్యాదుతో గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నమ్రత మరో నలుగురు గైనకాలజిస్టుల పేర్లనూ ఉపయోగించినట్లు గుర్తించారు. సృష్టి ఫెర్టిలిటీ మోసాలపై ఇప్పటివరకు 27 మందిపై కేసు నమోదు చేశారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఇప్పటి వరకు పోలీసులు 26 మందిని అరెస్ట్ చేశారు.