07-08-2025 08:33:49 AM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్(Kalvakuntla Chandrashekar Rao) చెప్పిన విధంగానే నడుచుకున్నానని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balaraju) అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మొదటిసారి బుధవారం అచ్చంపేటలోని తన ముఖ్య కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
గువ్వల బాలరాజు అంటేనే ఓ సెన్సేషన్ తనను ఉన్నదున్నట్లు మాట్లాడకుండా చూడాలంటే అసాధ్యమే అంటూనే బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో తనపై హత్యాయత్నానికి జరిగిన కుట్రపై పార్టీ స్పందించకపోవడం, వేర్వేరు ఘటనలపై తాను నాయకత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. 100 కోట్లకు అమ్ముడుపోయే పరిస్థితి తనది కాదని బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే తనకారులోనే నలుగురు ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ కి వెళ్లినట్లు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధినాయకత్వాలు తనతో టచ్‌లో ఉన్నాయని ప్రజల భవితవ్యం మెరుగుపడే దిశగా ఆలోచించే పార్టీ వైపే మొగ్గు చూపుతానన్నారు. 2007లో ఒక కార్యకర్తగా అచ్చంపేటకు వచ్చిన తనను ప్రజలు అక్కున చేర్చుకుని ఈ స్థానం కల్పించారని గుర్తు చేసుకున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాసేవే ధ్యేయంగా తన భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు. అచ్చంపేట యువతను తనతో రావాలని పిలుపునిచ్చారు.
అచ్చంపేట అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన తనను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలోనే తాను మంత్రి పదవిని ఆశించినట్లు తెలిపారు. గత ఎన్నికల్లోను కళాశాల భూమి ఆక్రమణ విషయంలో నిక్కచ్చిగా ఉన్నందుకే తనపై కుట్రలు చేసి బిఆర్ఎస్ పార్టీ ఓడించిందన్నారు.