calender_icon.png 11 February, 2026 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల విధుల నిర్వహణకు సిద్ధమైన సిబ్బంది

11-02-2026 12:51:19 AM

అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్

నిజామాబాద్, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి) : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేం దుకు అవసరమైన అన్ని చర్యలు జిల్లా యంత్రాంగం చేపట్టింది. పోలింగ్ నిర్వహణ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి పోలింగ్ సామాగ్రి తో సిబ్బంది తరలింపు, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాలలో వసతులు, కల్పించడంతోపాటు ఎలక్షన్ నిర్వహణ సి బ్బంది పోలింగ్ బూత్‌కు చేరుకుంటున్నారు. 

మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 11న జరుగనున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ అంకిత్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి వేర్వేరుగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించారు. నిజామాబాద్ కార్పొరేషన్ కు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు, బోధన్ మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ విజయ మేరీ హైస్కూల్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా, పీ.ఓ, ఏ.పీ.ఓ, ఓ.పీ.ఓలతో కూడిన బృందాల పట్టికను పరిశీలించారు.

సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.  ఎక్కడ కూడా రీపోలింగ్ కు ఆస్కారం లేకుండా పక్కాగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని, ఓటింగ్ సందర్భంగా గోప్యతను కాపాడేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ జరిపిస్తున్నందున, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు.  

అందుబాటులో వసతులు, వైద్యసిబ్బంది.. 

పోలింగ్ కేంద్రాలలో తాగునీరు, వీల్ చైర్ వంటి వసతులతో పాటు, ప్రతి పోలింగ్ స్టేషన్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాల్సిందిగా అధికారులను ఆదేశించారు.  ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. గడువు లోపు పోలింగ్ కేంద్రం లోనికి చేరుకున్న ఓటర్లకు సాయంత్రం 5.00 గంటలు దాటిన తరువాత కూడా టోకెన్లు జారీ చేసి, ఓటు వేసేందుకు అవకాశం కల్పించామన్నారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించాలని అన్నారు.

ఇదిలాఉండగా, అదనపు కలెక్టర్ అంకిత్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి భీంగల్, ఆర్మూర్ పట్టణాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించరు, పోలింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించి, చెక్ లిస్టు ప్రకారం సామాగ్రి అందిస్తున్నారా లేదా అన్నది పరిశీలించారు. అనంతరం అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకొని ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరును నిశిత పర్యవేక్షణ జరిపారు. వీరి వెంట సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, అధికారులు ఉన్నారు.