11 April, 2026 | 4:09 AM

ఆగిన అభివృద్ధి పనులు

29-06-2024 12:05 AM
  • నిధులు రాకపోవడంతో నిలిపివేసిన కాంట్రాక్టర్లు

అసంపూర్తిగా సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు

విడుదల చేయాలని మంత్రి పొన్నంకు వినతి

కరీంనగర్, జూన్ 28 (విజయక్రాంతి): కరీంనగర్‌లో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం హామీ నిధులతో చేపట్టిన సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణాల పనులు నిధుల లేమితో నిలిచిపోయాయి. కరీంనగర్ స్మార్ట్ సిటీని మట్టిరోడ్డు లేని నగరంగా తీర్చిదిద్దుతామని ఎన్నికలకు ముందు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రకటించడంతోపాటు ముఖ్యమంత్రి హామీ నిధుల నుంచి రూ.130 కోట్లు మంజూరు చేయించారు. మరో రూ.25 కోట్లు కరీంనగర్ రూరల్ పరిధిలో మంజూరు చేయించారు. గతేడాది నవంబరులో ఆదరాబాదరగా పనులు ప్రారంభించారు. రూ.132 కోట్లలో నగరంలోని 60 డివిజన్లకు డివిజన్‌కు రెండు కోట్లకు తగ్గకుండా పనులు కేటాయించారు.

ఇందులో రూ.60 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడం, మిగిలిన సీఎం హామీ నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు. పనులు మధ్యలోనే ఆగిపోయి ఆరు నెలలు కావస్తున్నది. ఈ పనులను స్మార్ట్ సిటీ పనులు చేపట్టిన ఒక సంస్థకు అప్పగించగా, సబ్ కాంట్రాక్టర్‌గా పలువురు మున్సిపల్ కాంట్రాక్టర్లు, బినామీలు పనులు చేపట్టారు. ప్రభుత్వం మారిన తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో స్మార్ట్ సిటీ పనులు చేపట్టిన సంస్థ కట్టరాంపూర్‌లో ఉన్న తమ కార్యాలయాన్ని ఎత్తివేసింది. దీంతో పనులు ప్రారంభించి మధ్యలో వదిలేసినవారు సబ్ కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు.

పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో సగం పూర్తయిన రోడ్లపై వెళ్లడానికి ప్రజలు జంకుతున్నారు. ఎక్కువగా శివారు ప్రాంతాలైన రేకుర్తి, తీగలగుట్టపల్లి ప్రాంతాల్లో పనులు మిగిలిపోయాయి. రోడ్డుపై వర్షపు నీరు నిలుస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలుచోట్ల కల్వర్టులకు, డ్రైనేజీలకు కలిపే లింకు పనులు కూడా ఆగిపోయాయి. రేకుర్తి డివిజన్‌లోని గౌడ్స్ కాలనీ, హనుమాన్‌నగర్, ద్వారకానగర్, టీచర్స్ కాలనీల్లో ప్రజలు నరకయాతన పడుతున్నారు. సుభాష్‌నగర్, ఆదర్శనగర్, బుట్టిరాజారాం కాలనీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కాగా గత ప్రభుత్వ సీఎం హామీ నిధులను వెంటనే విడుదల చేయాలని కార్పొరేటర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కూడా విజ్ఞప్తి చేశారు. 

ఆర్‌అండ్‌బీ, నగరపాలక సంస్థ సమన్వయ లోపం

ఆర్‌అండ్‌బీ, నగరపాలక సంస్థ శాఖల సమన్వయ లోపంతో వర్షాకాలం నగరంలో పలు ప్రాంతాల్లో వరదనీరు ప్రవహించి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల ప్రధాన స్టాం వాటర్ డ్రైనేజీలో ఆర్‌అండ్‌బీ శాఖ వారి నిర్లక్ష్యంతో డ్రైనేజీలో సిల్ట్ పేరుకుపోయి పెద్ద సమస్యగా మారింది. మంచిర్యాల చౌరస్తా, హుస్సేనిపురా, అమీర్‌నగర్, రాంనగర్ చౌరస్తాలాంటి ప్రాంతాల్లో ఆర్‌అండ్‌బీ డ్రైనేజీ కల్వర్టు వల్ల వర్షం వచ్చినప్పుడు నీరు సులువగా వెళ్లకుండా బ్యాక్‌వాటర్ రోడ్లపైకి, ఇండ్లలోకి వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

పెండింగ్ పనులు పూర్తి చేయాలి

  • మేయర్ సునీల్‌రావు ఆదేశం

నగరంలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో సమస్యలు తలెత్తకుండా మేయర్ సునీల్‌రావు శుక్రవారం అదనపు కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపూల్ దేశాయ్‌తో కలిసి సమీక్షిం చారు. నగరంలో నూతనంగా ప్రధాన స్టాం వాటర్ డ్రైనేజీ నిర్మాణం చేయడం ద్వారా పెద్దగా వరదనీటి సమస్యలు ఏర్పడలేదని మేయర్ తెలిపారు. డ్రైనేజీ నిర్మాణంలో ఉన్న చోట్ల వరద నీటి సమస్యలు వచ్చాయన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రధాన స్టాం వాటర్ డ్రైనేజీ గోడలు కూలిపోయిన ప్రదేశాలను గుర్తించి వాటి ని పునర్నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఆరు నెలలుగా ఇబ్బందులకు గురవుతున్నాం

రేకుర్తి నుంచి యూనివర్సిటీ వెళ్లే రోడ్డు పక్కన డ్రైనేజీ పనులు ప్రారంభించి వదిలేయడంతో ఆరు నెలలుగా ఇబ్బందులు పడుతున్నాం. గౌడ్స్ కాలనీకి వెళ్లలేని పరిస్థితి ఉన్నది. వర్షా కాలంలో నీరు నిలిచి దోమలు పెరిగి అనారోగ్యాలకు గురవుతున్నాం. ఇప్పటికైనా అసంపూర్తిగా మిగిలిన పనులు పూర్తి చేసి, వర్షపు నీటిని తొలగించాలి. 

 శ్రీనివాస్, 

హోటల్ నిర్వాహకుడు, 

గౌడ్స్ కాలనీ, రేకుర్తి

శివారు కాలనీలపై చిన్నచూపు వద్దు

నగరపాలక సంస్థలో విలీనమైన రేకుర్తిలో ఇప్పుడిప్పుడే రోడ్డు పనులు, డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. శివారు కాలనీలకు ప్రాధాన్యమిస్తామని పాలకులు ప్రకటించారు. సీఎం సహాయ నిధి కింద చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోవడంతో హనుమాన్‌నగర్, ద్వారకానగర్‌లలో మేము ఇళ్లలోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ కొన్నిచోట్ల అసం పూర్తిగా మిగిలిన ఉన్న పనులు మ్యాన్‌హోల్స్‌ను తలపిస్తున్నాయి. శివారు కాలనీలపై చిన్నచూపు చూడకుండా పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి. 

 లాల మురళి, రేకుర్తి