జూరాల ప్రాజెక్టుకు జలకళ
గద్వాల (వనపర్తి), జూన్ 28(విజయక్రాంతి): పాలమూరు వరప్రదాయిని జూరాల ప్రాజెక్టు వర్షపు నీటితో జలకళను సంతరించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు, ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది. జూరాలకు వస్తున్న వరద నీటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన గూడెందొడ్డి రిజర్వాయర్‌కు పంపు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేశారు.
గత వారం రోజుల నుంచి వరద నీటి ప్రవాహం పూర్తిగా తగ్గడంతో పంపు మోటార్లు నిలిపివేశారు. శుక్రవారం సాయంత్రం నాటికి జూరాల ప్రాజెక్టులో 317.60 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.971 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి సాగునీటి పథకాలకు నీటిని విడుదల చేయడం లేదన్నారు. నీటిని విడుదల చేయాలని జూరాల వరద నీటిపై ఆధారపడిన రైతులు కోరుతున్నారు.




