25-05-2025 12:00:00 AM
ప్రస్తుత కాలంలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరూ అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. అయితే ఏది మొదలు పెట్టాలన్నా కొన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యం.
వ్యాపారరంగంలో పోటీ తట్టుకొని నిలబడాలంటే ప్రణాళికాబద్ధంగా అడుగులేయాలి. సమయపాలన, క్రమశిక్షణ, ఒత్తిడికి దూరంగా ఉండటం వంటి అలవాట్లు విజయం సాధించడానికి మెట్లు. ముందుగా ఎంచుకున్న రంగంపై సమగ్రమైన అవగాహన పొందాలి. పరిశోధనతో పాటు అధ్యయనం చేయాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. అనుకున్న రంగంలో కొంత సాధన అవసరమవుతుంది.
ఇందు కోసం శిక్షణ తీసుకుంటే మెలకువలు తెలుస్తాయి. అందులో అడుగు పెడితే ఎంత వరకు విజయం సాధించొచ్చు అనేది అర్థమవుతుంది. మార్కెట్లో ఏయే బిజినెస్‌లు లాభదాయకంగా ఉన్నాయో పరిశీలించిన తర్వాత మాత్రమే వాటికి ప్రాముఖ్యతనివ్వాలి. వరుసగా పట్టికలా తయారుచేసి దేనికెంత పెట్టుబడి అవసరం అవుతుందో తెలుసుకోవాలి. లాభనష్టాలను బేరీజు వేయాలి.
పెట్టుబడి పెట్టిన ఎంతకాలానికి ఆదాయం, లాభాలు ఉంటాయో కూడా అధ్యయనం చేయాలి. మీరనుకుంటున్న రంగంలో విజయం సాధిస్తున్న వారిని కలిసి మాట్లాడాలి. అందులోని కష్టనష్టాలను తెలుసుకుంటే భవిష్యత్తు ప్రణాళికపై మీకు అవగాహన కలుగుతుంది. అప్పుడే ఏదో ఒకదాన్ని ధైర్యంగా ఎంచుకోవచ్చు.