నటిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నా
ఒకే తరహా పాత్రలు చేయడం తనకు నచ్చదని, విభిన్న పాత్రల్లో ఆలరించడమే తనకు ఇష్టమని చెబుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘సికందర్ కా ముఖద్దర్’. ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంగ్లిష్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది తమన్నా.
‘నేను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చా. ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని అంతకుముందు ఎప్పుడూ అనుకోలేదు. అలా వచ్చిన నేను ఈ ఫీల్డ్‌కు వచ్చి 15 అవుతోంది. గొప్ప వ్యక్తులతో నటించా. ప్రతి సినిమా, నటీనటుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నా. కెరీర్ ఆరంభంలోనే తెలుగు, తమిళ భాషల్లో కమర్షియల్ విజయాలు అందుకున్నప్పటికీ ఏదో వెలితిగా అనిపించేది. నటిగా ఏదో చేయాలనే తపన ఎప్పుడూ తగ్గలేదు. నన్ను సవాల్ చేసే విభిన్న పాత్రలు చేయాలన్న ఆలోచనే ఎప్పుడూ ఉండేది.
అయితే అందరిలా కమర్షియల్ సక్సెస్ తర్వాత ప్రయోగాత్మక పాత్రలు చేయాలనుకోలేదు. ‘బాహుబలి’ ఆ క్రమంలో చేసిందే. ఆ సినిమా నాతోపాటు ఆ టీమ్ అందరికీ టర్నింగ్ పాయింట్. ఆ చిత్రం తర్వాత కూడా విభిన్న పాత్రలు పోషిస్తూ ముందుకెళ్తున్నా. ఇక ‘సికందర్ కా ముఖద్దర్’తో నటిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నా. ఇందులో నా పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుంది” అని తెలిపింది. ఈ సినిమాలో తమన్నా వజ్రాల దొంగతనం కేసులో అనుమానితురాలిగా నటించింది.






