ఔను, వచ్చే నెలలోనే నా పెళ్లి
కీర్తి సురేశ్ ప్రస్తుతం ‘బేబీ జాన్’ అనే హిందీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ సినిమాతోనే ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులో వరుణ్ ధావన్ కథానాయకుడు. కోలీవుడ్‌లో విడుదలైన ‘తెరీ’ చిత్రానికి రీమేక్‌గా ఇది రూపొందుతోంది. ఇదిలా ఉండగా, ఇటీవల తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది కీర్తి. తన స్నేహితుడు ఆంటోనీతో ప్రేమలో ఉన్నట్టు చెప్పిన విషయం తెలిసిందే. కీర్తి పెళ్లి ముహూర్తం కూడా ఖరారయింది.
వచ్చే నెలలోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. తన కుటుంబ సభ్యులతో శుక్రవారం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకుంది కీర్తి. దర్శనానంతరం ఆమె అక్కడి రంగనాయకుల మండపంలో పండితుల వేదాశీర్వచనాలు అందుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కీర్తి తన పెళ్లి ముచ్చటను బయటపెట్టింది. ‘వచ్చే నెలలోనే నేను పెళ్లి చేసుకోనున్నది నిజమే. నా వివాహ వేడుక గోవాలో జరుగుతుంది. అంతేకాదు నేను నటిస్తున్న హిందీ సినిమా ‘బేబీ జాన్’ కూడా వచ్చే నెలలో విడుదల కానుంది. అందుకే స్వామివారి దర్శనం కోసం వచ్చాను’ అని చెప్పింది కీర్తి సురేశ్.






