18 July, 2026 | 9:35 AM

అనురాగమే గొప్పదని చెప్పిన ఆడపడుచు

30-11-2024 12:00 AM

గుండెను కదిలించే సంభాషణలు, కన్నీరు కార్పించే సన్నివేశాలు, బిగువు సడలని కథాగమనంతో ప్రేక్షకుల హృదయాలను తడి చేసింది ఆ ‘ఆడపడుచు’ సినిమా. విశ్వజనీనమైన సోదర ప్రేమ సూత్రంతో కమ్మని కథను బంధించి, కమనీయంగా చిత్రీకరించడం ద్వారా పసగల చిత్రాలు అందించగల నిర్మాణ సంస్థలు, దర్శక నిర్మాతలు తెలుగు నేలపై ఉన్నారన్న మెచ్చుకోళ్లు సినీప్రియులు, విమర్శకుల నుంచి వచ్చేలా చేసిన చిత్రమిది.

నందమూరి తారక రామారావు, చంద్రకళ, శోభన్‌బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆడపడుచు’. సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కే హేమాంభరరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ కథను ఎల్‌వీ ప్రసాద్ రాశారు. 1967 నవంబర్ 30న విడుదలైంది. రేలంగి వెంకటరామయ్య, బీ పద్మనాభం, గీతంజలి రామకృష్ణ, శోభన్‌బాబు, వాణిశ్రీ, చదలవాడ కుటుంబరావు, ఏవీ సుబ్బారావు (జూనియర్), కోళ్ల సత్యం, కాశీనాథ తాత, రాధాకుమారి, ఝాన్సీ, కృష్ణకుమారి, హరనాథ్, నాగభూషణం ఇతర పాత్రలు పోషించారు.

ఈ చిత్రంలో చంద్రకళ అన్నలుగా ఎన్టీఆర్, శోభన్‌బాబు నటించారు. ఎన్టీఆర్ పెద్దన్న పాత్రలో కనిపించారు. పెళ్లి ఆనందంలో ఊయలూగుతూ కళ్లు తిరిగి పడిపోయి, కళ్లు పోగొట్టుకుంటుంది చెల్లెలు శారద (చంద్రకళ). పెళ్లి పీటల మీదే ఆగిపోతుంది. చదువుల కోసం పట్నం వెళ్లిన చిన్నన్న శేఖర్ (శోభన్‌బాబు) వాణిశ్రీతో ప్రేమాయణం సాగిస్తూ చదువును నిర్లక్ష్యం చేస్తాడు. పెళ్లి ఆగి, కళ్లు పోయి కన్నీరు మున్నీరుగా విలపించే శారద కనీసం చిన్నన్న పెళ్లయినా చేయమని పెద్దన్నను కోరుతుంది.

చిన్నన్న పెళ్లాం వచ్చినట్టే వచ్చి తన మొగున్ని వేరు చేసి కాపురం పట్నానికి మార్పిస్తుంది. కొత్త పెళ్లాం చెప్పుడు మాటలు విని చెడిపోయే మగమహారాజుల తీరును దర్శకుడు ఈ చిత్రంలో చూపించాడు. ఇంటి సమస్యల్లో పడి ఉద్యోగం పోగొట్టుకుంటాడు పెద్దన్న. పెద్దన్న, అంధురాలైన చెల్లి తర్వాత పడ్డ కష్టాలేంటి? చిన్నన్న తప్పు తెలుసుకున్నాడా? ముగ్గురూ కలిశారా? వంటి ట్విస్టులు, మలుపులతో ఈ సినిమా మెప్పిస్తుంది. దాశరథి రచననలో టీ చలపతిరావు సంగీత మాధుర్యంలో పీ సుశీల పాడిన పాట ‘అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం’ అనే పాట ఈ చిత్రంలోనిదే.