2 July, 2026 | 1:52 AM

మరుగుదొడ్లలో దాచి.. దోచి!

02-07-2026 12:42 AM
  1. కుంభమేళా సమయంలోనే భారీగా నగదు మాయం
  2. ఆలయ ట్రస్టీ అనిల్ మిశ్రా కీలక పాత్ర
  3. లెక్కింపు వ్యవస్థలో, సీసీ కెమెరాలలో లొసుగుల వల్లే..
  4. ఒకరు నగదు తీస్తుంటే.. మిగతావారు చుట్టూ కవచం
  5. అయోధ్య విరాళాల చోరీ కేసులో నిందితుడు అవినాశ్ శుక్లా పోలీసులకు వివరణ

లక్నో, జూలై 1: అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. కొట్టేసిన డబ్బును మరుగుదొడ్లలో దాచి.. ఆ తర్వాత వీలుపడినప్పు డల్లా అక్కడి నుంచి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కుంభమేళా సమయంలోనే రామ మందిరంలో అత్యధిక మొత్తంలో చోరీ జరిగినట్లు వెల్లడించారు. ఆయోధ్య రామ మందిర విరాళాల అవకతవకల కేసుపై దర్యాప్తు చేసేందుకు యూపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిట్ నివేదిక మేరకు జూన్ 25న పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అవినాశ్ శుక్లా, అనుకల్ప్ శుక్లా, లవ్కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామశంకర్ మిశ్రా, శుభాష్ శ్రీవాత్సవ, రామశంకర్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. జూలై 13 వరకూ వారికి కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దర్యాప్తులో భాగంగా పలు చోట్ల రైడ్స్ నిర్వహిస్తున్న పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బంధువులను కూడా ప్రశ్నిస్తున్నారు.

కోర్టు అనుమతి పొందిన అనంతరం, పోలీసులు మంగళవారం అవినాష్ శుక్లాను దాదాపు రెండు గంటల పాటు విచారించారు. తాము దొంగలించిన విరాళాల సొమ్మును తమ వెంట తీసుకెళ్లకుండా మరుగుదొడ్లలో దాచి ఉంచినట్లు, ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి తరలించినట్లు నిందితుడు అవినాశ్ శుక్లా తెలిపాడు. లెక్కింపు వ్యవస్థలో లొసుగులను, కోట్లాది రూపాయలను ఎలా కొట్టేసింది, తర్వాత జరిగిన తతంగాన్ని అంతా వివరించాడు.

విచారణ సమయంలో, విరాళాల లెక్కింపు ప్రక్రియలో ఆలయ ట్రస్టీ అనిల్ మిశ్రా కీలక పాత్ర పోషించారని నిందితుడు వివరించాడు. విరాళాల లెక్కింపు గది తాళాలలో ఒకటి నిందితుడు టిన్ను యాదవ్ వద్ద ఉండగా, రెండో తాళం బ్యాంకు ఉద్యోగుల వద్దే ఉందని అవినాష్ శుక్లా పోలీసులకు తెలిపారు. పలువురు వ్యక్తులు కలిసికట్టుగా వ్యవహరించి డబ్బును దొంగిలించామని, వారిలో ఒక వ్యక్తి నగదు తీసుకుంటుండగా, మిగతావారు అతడి చుట్టూ కవచంలా ఉండేవారన్నాడు.

కాంప్లెక్స్ లోపల అమర్చిన కెమెరాల స్థానాలు నిందితులందరికీ తెలుసని దర్యాప్తు అధికారులకు తెలిపాడు. దీంతో పట్టుబడకుండా తప్పించుకుని, డబ్బును బాత్‌రూమ్ వంటి ప్రదేశాలలో దాచి, తరువాత అవకాశం దొరికినప్పుడల్లా దానిని తీసివేసేవారమన్నారు. ట్రస్ట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు తాము దగ్గరగా ఉండటం వల్ల తమపై పెద్దగా అనుమానం రాలేదని, తమను నిశితంగా పర్యవేక్షించలేదని శుక్లా పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో అమర్చిన కెమెరాలను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారని, అయితే నిఘా సిబ్బంది తమ కదలికలను చురుకుగా గమనించడం లేదని నిందితులు పోలీసులకు తెలిపారు.

గతేడాది ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన కుంభమేళా సమయంలోనే రామమందిరంలో అత్యధిక మొత్తంలో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. కుంభమేళాకు వచ్చిన కోట్లాది మంది భక్తులు అయోధ్య రామ మందిరాన్ని కూడా సందర్శించారని, ఆ సమయంలో ఆలయానికి భారీ మొత్తంలో కానుకలు, విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇదే అదునుగా  నిందితులు కానుకల నుంచి కోట్లాది రూపాయలు మాయం చేశారని తెలిపారు.

అయితే లవకుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా అనే బావమరుదులు భారీగా నగదు చోరీచేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తులను పరిశీలించడానికి ఐటీ, ఈడీ సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కుట్రలో కొంతమంది ఎస్‌బీఐ ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు సందేహం వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందన్నారు. అయితే ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 15 రోజుల గడువును పొడిగించిందని అధికారులు బుధవారం తెలిపారు.