వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.183 తగ్గింపు.. హైదరాబాద్‌లో కొత్త రేటు ఎంత?
- 19 కేజీల సిలిండర్‌పై రూ.183 డౌన్
- హోటళ్లు, రెస్టారెంట్‌ల యాజమాన్యాలకు ఉపశమనం
- సవరించిన రేట్లు తక్షణం అమల్లోకి
- ‘డొమెస్టిక్’ధరలో నో చేంజ్
న్యూఢిల్లీ, జూలై 1: కమర్షియల్ గ్యాస్ ధర భారీగా తగ్గింది. 19 కిలోల సిలిండర్‌పై రూ.183 మేర తగ్గిస్తూ కేంద్ర బుధవారం పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, చిన్న వ్యాపారులకు ఉపశమనం లభించింది. సవరించిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఏడాది వాణిజ్య సిలిండర్ ధర తగ్గడం ఇదే మొదటిసారి. ఇరాన్-- యుద్ధ ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ ఎల్పీజీ సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో గత కొన్ని నెలలుగా కమర్షియల్ గ్యాస్ ధరలు వరుసగా పెరిగాయి. తాజాగా పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. దేశీయ ఉత్పత్తి మెరుగుపడటం, దిగుమతి ఎల్పీజీ కార్గోల రాక ప్రారంభం కావడంతో సరఫరా పరిస్థితులు స్థిరపడుతున్నాయి. దీంతో గ్యాస్ ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Commercial LPG Cylinder Price July 2026: 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై కేంద్ర ప్రభుత్వం రూ.183 వరకు తగ్గింపు ప్రకటించింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వ్యాపారులు, చిన్న వ్యాపారులకు ఉపశమనం లభించింది. హైదరాబాద్‌లో కొత్త ధర రూ.3,191గా ఉండగా, Domestic LPG (14.2 Kg) ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
సామాన్యుడికి నిరాశే..
ధర తగ్గింపు కేవలం కమర్షియల్ గ్యాస్ వినియోగానికి మాత్రమే వర్తిస్తుంది. గహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కేజీల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు 40,000 టన్నుల కంటే ఎక్కువగా నిలబెట్టేలా చర్యలు కొనసాగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..
ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 183.50 తగ్గి రూ. 2,930 కి చేరింది. హైదరాబాద్‌లో రూ. 176 తగ్గడంతో కొత్త ధర రూ. 3,191గా ఉంది. ముంబైలో రూ. 2,885.50, బెంగళూరులో రూ. 3,021, కోల్‌కతాలో రూ. 3,081.50కి సిలిండర్ లభిస్తోంది. కమర్షియల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో హోటళ్ల నిర్వహణ ఖర్చులు భారంగా మారాయి. ఇప్పుడు రూ.180 వరకు తగ్గడం వల్ల ఇన్‌పుట్ కాస్ట్ కొంత కలిసి వస్తుందని హోటళ్లు, రెస్టారెంట్‌ల నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.






