30-04-2025 08:05:41 PM
99.29 శాతం ఉత్తీర్ణత..
162 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత..
మహబూబాబాద్ (విజయక్రాంతి): పదో తరగతి వార్షిక ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా 99.29 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలిచింది. పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 8,184 మంది విద్యార్థులు హాజరు కాగా, 8,126 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 4,195 బాలురు కాగా, 3,931 బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, మహబూబాబాద్ జిల్లా 99.29 శాత ఉత్తీర్ణత సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
జిల్లాలో 201 పాఠశాలలకు 162 పాఠశాలలు పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వరుసగా 582, 580, 579, 574, 563 మార్కులు సాధించడం మరో విశేషంగా నిలిచింది. పదో తరగతి ఫలితాల్లో మానుకోట జిల్లాను అగ్రస్థానాల నిలిపినందుకు కృషిచేసిన ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) అభినందించారు.
నూటికి నూరు శాతం ఉత్తీర్ణత
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా లో సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలో ఐదు బిసి వెల్ఫేర్ పాఠశాలలు ఉండగా 5 పాఠశాలకు చెందిన విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఐదు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉండగా ఐదు పాఠశాలలకు చెందిన విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక జిల్లావ్యాప్తంగా 15 కేజీబీవీ పాఠశాలలు ఉండగా 14 పాఠశాల విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే 8 మోడల్ స్కూల్లో ఉండగా 5 స్కూల్లలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఐదు గిరిజన గురుకుల పాఠశాలలో ఉండగా నాలుగు పాఠశాలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. మూడు మైనార్టీ పాఠశాలలు ఉండగా ఒక పాఠశాల విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక 18 ఆశ్రమ పాఠశాలలో ఉండగా 12 పాఠశాలల విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ప్రైవేట్ సెక్టార్ లో 45 పాఠశాలలు ఉండగా 41 పాఠశాలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే జిల్లా పరిషత్తు సెక్టార్లో 97 పాఠశాలలు ఉండగా 75 పాఠశాలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు.