29 April, 2026 | 3:21 AM

మే 5న రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్ష

29-04-2026 01:46 AM
  1. దీక్షలో ప్రతి ఉద్యోగి పాల్గొనాలి
  2. తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్

ముకరంపుర, ఏప్రిల్ 28(విజయక్రాంతి): జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్‌లో జేఏసీ భాగస్వామ్య పక్షాలతో అత్యవ సర సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మే 5వ తేదీన నిర్వహించనున్న ఒక్క రోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి ఉద్యోగి పాల్గొ నాలని మారం జగదేశ్వర్ పిలుపునిచ్చారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నా యకులు మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామస్థాయికి చేరవేసి సమర్థవంతంగా అమలు చేసే వారు ప్రభుత్వ ఉద్యోగులేనని, అలాంటి ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వా నిదేనని స్పష్టం చేశారు. అనేక సమస్యలు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డిఏలు, సంవత్సరానికి ఒకసారి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు, ఐదు సంవత్సరాలకు ఒకసారి అమలు చేయాల్సిన పీఆర్సీ వంటి హక్కులను కాలానుగు ణంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ఉద్యోగుల జీపీ ఎఫ్ డబ్బులు, సరెండర్ లీవ్ బిల్లులు, టీజీఎల్‌ఐఎఫ్ ఇన్సూరెన్స్ బిల్లులు, వివిధ రకాల ఏరియర్స్ సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఓపిఎస్ పునరుద్ధరణపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, సీపీఎస్ రద్దుపై ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. హెల్త్‌కార్డు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎంపానెల్ ఆసుపత్రులను ఖరారు చేయకపోవడం వల్ల ఉద్యోగులు వైద్య సేవల విషయంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సిం గ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌లో జరుగుతున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులందరూ ఒకే స్వరంతో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యో గుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్‌రెడ్డి కన్వీనర్ మడిపల్లి కాళిచరణ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జీ కటకం రమేష్ పెండ్యాల కేషవరెడ్డి వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులు తిరుపతిరావు, జయపాల్ రెడ్డి, సుంకిశాల ప్రభాకర్ రావు, చింతపల్లి అశోక్ జైపాల్ రెడ్డి, కోట రామస్వామి, శంకర్, జాలి మహేందర్‌రెడ్డి వివిధ సంఘాల సంబంధించిన నాయకులు డాక్టర్ అరవింద్ రెడ్డి, సర్దార్ హర్మీందర్ సింగ్, ఒంటెల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.