జాతి ఆత్మగౌరవ ప్రతీకగా విగ్రహం
- ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం
- మండలిలో విగ్రహ రూపకల్పనపై డిప్యూటీ సీఎం ప్రకటన
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ తల్లి విగ్రహం కేవలం విగ్రహం మాత్రమే కాదని తెలంగాణ జాతి ఆత్మగౌరవ ప్రతీక అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. ఇకనుంచి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు.
అనేక ప్రజా పోరాటాలకు ఊపిరిపోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసి సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో డిప్యూటీ సీఎం మాట్లాడారు.
ప్రజల మనో ఫలకాలపై నిలిచి ఉన్న తెలంగాణ రూపాన్ని సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధమైందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో సంస్కృతి, సంప్రదాయం, చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దినట్టు పేర్కొన్నారు. విగ్రహ పీఠంలోని నీలం వర్ణం ‘గోదావరి, కృష్ణమ్మలు తల్లీ నిను తడపంగ..’
అన్న అందెశ్రీ గీతంలోని తెలంగాణ జల దృశ్యానికి ప్రతీకగా నిలుస్తుందని అభివర్ణించారు. ఆకుపచ్చ వర్ణం.. పచ్చని నేలల్లో పసిడి సిరులు పండంగ అన్న సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా కనిపిస్తుందని చెప్పారు. ఎరుపు వర్ణం.. మార్పునకు, ప్రగతికి, చైతన్యానికి ప్రతీకని, బంగారు వర్ణం.. శుభానికి, ఐశ్వర్యానికి, సమృద్ధికి నిదర్శనంగా నిలబడుతుందని వెల్లడించారు.
విగ్రహాన్ని తొలగించకుండా చర్యలు
తెలంగాణ ఉద్యమంలో గుండెలపై టీజీ సంక్షిప్త నామాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నారని, ఆ ఆకాంక్షలను నెరవేర్చే ఉద్దేశంతో తెలంగాణ సంక్షిప్త నామంగా టీజీకి అధికారిక గుర్తింపును ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని భట్టి చెప్పారు.
తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విగ్రహాన్ని భవిష్యత్‌లో తొలగించకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. విగ్రహావిష్కరణ చారిత్రక నిర్ణయానికి సభ్యులందరూ ఆమోదం తెలపాలని కోరారు. అనంతరం సభ్యులు ఆమోదం తెలపడంతో వారికి కృతజ్ఞతలు తెలిపారు.






