అకట్టుకున్న డ్రోన్‌షో
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన ఏడాది విజయోత్సవాలు సోమవారం వైభవంగా ముగిశాయి. నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన డ్రోన్, లేజర్ షో ఆకట్టుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబం ధించిన ఆకృతులను డ్రోన్ షో ద్వారా చూపించారు.
రైతు భరోసా, మహాలక్ష్మీ పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరా మహిళా శక్తి పథకం, ఏడాదిలోనే 55 వేల కొలువుల జాతర తదితర అంశాలను విద్యుత్ కాంతులతో ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక బాణాసంచా వెలుగులు మిరిమిట్లు గొలిపాయి. ఈ ప్రదర్శనలన్నిటినీ సచివాలయం నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు తిలకించారు. సచివాలయం ఆవరణ, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు డ్రోన్, లేజర్ షోను చూసి సంతోషం వ్యక్తం చేశారు.






