19 May, 2026 | 12:36 AM

ఎంపాక్స్‌పై అప్రమత్తంగా ఉన్నం

25-08-2024 02:18 AM
  1. 4,600 పైగా డెంగ్యూ కేసులు నమోదు 
  2. డీహెచ్ రవీందర్ నాయక్

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): ఎంపాక్స్‌పై అప్రమత్తంగా ఉన్నామని వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు రవీందర్ నాయక్ తెలిపారు. సీజనల్ వ్యాధులు, మంకీ పాక్స్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. శనివారం కోఠిలోని తన ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. వాతావరణం మారినప్పుడు డెం గ్యూ, మలేరియా, చికెన్ గున్యా, హెచ్1ఎన్1 వంటి వ్యాధులు సీజనల్ గా వస్తుంటాయని తెలిపారు.వీటి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

రాష్ర్టంలో ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ నెల 21 నాటికి 4,600 పైగా డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఇది పరీక్షలు చేసిన సంఖ్య 66,589తో పోలిస్తే కేవలం 7 శాతం మాత్రమేనని, ఇందులో ఒక్కరు కూడా మృతి చెందలేదన్నారు. అత్యధికంగా హైదరాబాద్ లో 1,697, సూర్యాపేటలో 416, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 405 కేసులు నమోదయ్యాని తెలిపారు. 10 జిల్లాల్లో మాత్రం డెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయన్నారు. జిల్లాల్లోని అధికారులతో సమన్వయం చేసుకొని తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇంటింటి సర్వే చేయడంతో పాటు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. సీజనల్ వ్యాధులపై తాము అప్రమత్తంగా ఉన్నామని, వైద్యులు, మందుల కొరత లేదని తెలిపారు. 

సర్వేలో 3,91,72,300 పరీక్షలు..

రాష్ర్టవ్యాప్తంగా జులై 23 నుంచి ఈ నెల 24 వరకు 1,27,49, 028 ఇళ్లలో 3,91,72,300 పరీక్షలు చేశామన్నారు. 2,45,111 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు డీహెచ్ తెలిపారు. జిల్లాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ సైతం పనిచేస్తున్నాయన్నారు. రాష్ర్టంలో ఇప్పటి వరకు 2036 పరీక్షలు చేయగా అందులో 106 మందికి మాత్రమే చికున్ గున్యా పాజిటివ్ గా వచ్చిందన్నారు. 22.79 లక్షల పరీక్షలు చేయగా 188 మలేరియా కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. ఇది కేవలం 0.01 శాతం మాత్రమేనని వెల్లడించారు. 

ఎంపాక్స్ కోసం ప్రత్యేక వార్డు-..

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు అప్రమత్తమై రాష్ర్టంలో ఎంపాక్స్ పై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డీహె తెలిపారు. దేశంలో ఈ ఏడాది మార్చి తర్వాత ఒక్క కేసు కూడా నమో దు కాలేదన్నారు. అయినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గాంధీ వైద్యశాలను నోడల్ హాస్పిటల్‌గా గుర్తించి ఎంపాక్స్ కోసం ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేశామన్నారు. మహిళలు, పురుషులకు ప్రత్యేకం గా వార్డులో పడకలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు పీహెచ్‌సీల్లో ఖాళీలు ఉన్నాయని త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు.