11 మంది విద్యార్థులకు చేయూత
ముందుకొచ్చిన సీడ్ సంస్థ
హైదరాబాద్, ఆగస్టు 24 (విజయ క్రాంతి): మైనార్టీ గురుకులానికి చెందిన విద్యార్థులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు సపోర్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్(సీడ్) సంస్థ ముందుకొచ్చినట్టు మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శి అయేషా మస్రత్ ఖానం తెలిపారు. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో సీటు సంపాదించిన 11 మంది విద్యార్థులకు ఫీజు చెల్లించనున్నట్టు పేర్కొన్నారు. ఆ విద్యార్థులకు ఆర్థికం చేయూతనివ్వడం కోసం సీడ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సయ్యద్ ఎం హుస్సేని రూ. 85 లక్షల చెక్కులను మైనార్టీ గురుకుల కార్యదర్శికి అందజేశారు. ఈ నిధుల్లో నుంచి 11 మంది విద్యార్థుల ఉన్నత చదువులకు కావాల్సిన రూ.8,51,458 లను కార్యదర్శి మస్రత్ ఖానం సదరు విద్యార్థులకు అందించారు.
సమస్యలు పరిష్కరించండి
మైనార్టీ గురుకుల ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆ సంస్థ కార్యదర్శి అయేషా మస్రత్ ఖానంను ప్రొగ్రెసీవ్ రెసిడెన్షియల్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. పీఆర్‌జీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్‌రెడ్డి, పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డితో కలిసి కార్యదర్శికి శనివారం వినతిపత్రం అందించారు.
సమస్యల పట్ల కార్యదర్శి మస్రత్ ఖానం సానుకూలంగా స్పందించారని, వచ్చే వారం లో 317 సంబంధించి లిస్ట్‌లో లేని ఉద్యోగుల పేర్లను సేకరించి ప్రభుత్వ ఆదేశాను సారం వారి ప్రాధాన్యత జోన్లను కేటాయిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. అక్టోబ ర్‌లో అరైజింగ్ వెకేన్సీ ఆధారంగా టీజీటీలకు వంద శాతం పదోన్నతి కల్పిస్తామన్నట్టు పేర్కొన్నారు. త్వరలో నే కామన్ సీనియార్టీ జాబితాను తయారు చేసి జూనియర్ లెక్చరర్లను గ్రేడ్ 1 ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పించ డంతోపాటు ఇతర సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.






