9 July, 2026 | 1:00 AM

ఫీజులు ఇవ్వకుంటే గద్దె దిగాలి

09-07-2026 12:00 AM
  1. రీయింబర్స్‌మెంట్ అమలు చేయకుంటే పీఠాలు కూలుతయ్ 
  2. రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి 
  3. ఈ నెల 20న విద్యార్థుల మిలియన్ మార్చ్ 
  4. అఖిలపక్ష సమావేశంలో బీసీ నేతల హెచ్చరిక 

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని, ఇదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం పీఠాలు కూలుతాయని అఖిలపక్ష నేతలు, బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ అధ్యక్షతన ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య ఉద్యమ  కార్యాచరణపై అఖిలపక్ష సమావేశం జరిగింది.

బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేసి కాంగ్రెస్ బీసీల ద్రోహానికి పాల్పడుతుందనిన్నారు. ఆ ఉద్దేశంతోనే హైకోర్టులో ఫీజు రీయింబర్స్‌మెంట్ కేసులో కనీసం అడ్వకేట్ జనరల్ హాజరు కాకుండా కావాలనే ఫీజుల రద్దుకు సంబంధించిన తీర్పు రావాలని చూస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం అమలు చేస్తలేదని ఈ విద్యా సంవత్సరం ఇంజనీరింగ్ అడ్మిషన్లు ఉత్తీర్ణత అయిన 50వేల మంది బడుగు విద్యార్థులు కౌన్సిలింగ్‌లో పాల్గొనలేదని తెలిపారు.

9 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వ స్పందించడం లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల సత్తా చూపించడానికి ఈ నెల 20వ తేదీన హైదరాబాదులో విద్యార్థుల మిలియన్ మార్చ్ నిర్వహించి తీరుతామని వెల్లడించారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు తప్ప చేతలు లేవన్నారు.

వారు అనుకున్న మూడు ట్రిలియన్ ఆదాయం రావాలంటే మానవ వనరుల అభివృద్ధి జరగాలని, ప్రతి ఒక్కరు ఉన్నత విద్యను అభ్యసించి స్వశక్తితో ఎదగాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఉన్నత చదువుకు ఆసరాగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధతో రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం గంధరగోళంలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్ శాసన సభ పక్ష నేత మధుసూదన చారి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ సాధించుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని పదేపదే చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి తన మూడు రాష్ట్ర బడ్జెట్ లలో ఎవరెవరికి ఎంత ఇచ్చారో, ఏ పథకానికి ఎంత ఖర్చు చేశారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందుతుందన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10వ తేదీన వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల బందుకు పిలుపునిచ్చాయని, ఆ బందుకు, బీసీ ఉద్యమాలకు సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆయన ప్రకటించారు. విద్యార్థులు చదువుకోకుండా ప్రభుత్వం అడ్డుకోవడం తగదని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్ అన్నారు.

సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కార్యనిర్వాహ అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కుర్మా, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నరసింహ నాయక్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారకేశ్వరి, బీసీ మేధావుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ రమేష్, కౌలే జగన్నాథం, వరుణ్ కుమార్, నాయకులు సత్యరాజ్ గౌడ్ గౌతమి, దేవిక, ఇంద్రమ్ రజక, మీసాల గణేష్, రాజేశ్వరి,  కోటి, బండి గారి రాజు తదితరులు పాల్గొన్నారు.