ఓటు సవరణ ‘మహా’ యజ్ఞం
- రంగారెడ్డి ‘ఎనిమిది’ దిక్కుల్లో బీఎల్వోల బెంబేలు!
- ఐటీ హబ్ నుంచి పల్లెల దాకా ఓటర్ల తప్పుల తడక
- అపార్ట్మెంట్లలోకి నో ఎంట్రీ..
- పల్లెల్లో 2002 రికార్డుల ‘మ్యాపింగ్’ తలనొప్పి
- తీవ్ర ఒత్తిడిలో మహిళా సిబ్బంది.. సపోర్టింగ్ స్టాఫ్ కావాలని డిమాండ్
రంగారెడ్డి, జులై 8 (విజయక్రాంతి): రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్ ) ప్రక్రియ రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది కీలక నియోజకవర్గాల్లో (మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంప ట్నం, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, కల్వకుర్తి) బూత్ లెవల్ ఆఫీసర్లకు (బీ ఎల్ ఓ ) అగ్నిపరీక్షగా మారింది.
విద్యావంతుల నిర్లక్ష్యం: ఉన్నత విద్యావంతులు సైతం ఫామ్-6, కాలమ్ -8 లలో తప్పుల తడకగా వివరాలు నింపుతుండడంతో, టెన్త్ లోపు చదివిన అంగన్వాడీ, ఆశా వర్కర్లకు వాటిని సరిదిద్దడం తలనొప్పిగా మారింది.
ఐటీ హబ్లో ‘నో ఎంట్రీ’: శేర్లింగంపల్లి, ఎల్బీనగర్ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ అపార్ట్మెంట్లలోకి మహిళా బీఎల్వోలను సెక్యూరిటీ సిబ్బంది రానివ్వడం లేదు.
ఒంటరి ప్రయాణం భద్రత కరువు: రాజేంద్రనగర్, మహేశ్వరంలోని కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో సపోర్టింగ్ స్టాఫ్ లేకపోవడంతో ఒంటరిగా ఇళ్లలోకి వెళ్ళడానికి మహిళా సిబ్బంది భయపడుతున్నారు.
చిరునామాల గందరగోళం: ఇబ్రహీంపట్నం, షాద్నగర్ లలో రియల్ ఎస్టేట్ మార్పుల వల్ల ఇళ్లు ఖాళీ చేసిన వేలాది మంది ఓటర్లను వెతికి పట్టుకోవడం సవాల్గా మారింది.
2002 రికార్డుల ’మ్యాపింగ్’ పెనుభారం: చేవెళ్ల, కల్వకుర్తి వంటి గ్రామీణ ప్రాంతా ల్లో ప్రస్తుత ఓటర్ల డేటాను 2002 నాటి రికార్డులతో లింక్ చేయాలన్న నిబంధన సాంకేతిక గందరగోళానికి దారితీస్తోంది.
సస్పెన్షన్ల కత్తి: తమ రెగ్యులర్ డ్యూటీలతో పాటు ఈ అదనపు భారాన్ని మోస్తున్న సిబ్బందికి, టార్గెట్లు రీచ్ కాకపోతే అధికారులు షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లు ఇస్తుండడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ గందరగోళం వీడాలంటే పట్టణాల్లో వార్డు ఆఫీసర్లను, పల్లెల్లో పంచాయతీ సెక్రటరీలను బీఎల్వోలకు ’సపోర్టింగ్ స్టాఫ్’గా అటాచ్ చేయాలని, సర్వే గడువును పెంచాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.






