చదువు‘కొనే’ రోజులు..
- ఫీజుల నియంత్రణ చర్యలు తీసుకోని ప్రభుత్వం
- ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు
- చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు
సికింద్రాబాద్, జూలై 8 (విజయక్రాంతి): నేడు రాష్ట్రంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల ఫీజులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. చదువుకునే రోజులు పోయి చదువు కొనే రోజులు వచ్చాయి. పిల్లల చదువు కోసం వేలల్లో, లక్షల్లో సొమ్ములు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ స్కూల్లో పదో తరగతి విద్యార్థికి స్కూల్, హాస్టల్ కలిపి మొత్తం లక్ష రూపాయలు, కొన్ని స్కూళ్లలో ఎల్.కె.జి, ఇంటర్ ఫీజులే సుమారు రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల మధ్యలో వసూలు చేస్తున్నారు.
తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పించాలనే ఉద్దేశ్యంతో అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూళ్లకు వెళుతున్న తల్లిదండ్రులు అక్కడి ఫీజులు చూసి, వాటిని కట్టడం తమ వల్ల కాదని నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధనలు రూపొందించినా తమ రూల్ తమదే అనేలా కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు ప్రవర్తిస్తున్నాయి. కొన్ని స్కూళ్లు అయితే ఒకేసారి మొత్తం అడ్మిషన్ ఫీజు, పాఠశాల ఫీజు కట్టాలనే నిబంధనలను అమలు చేస్తున్నాయి.
రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలేదీ...
విద్యాహక్కు చట్టం సెక్షన్-6 ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అడ్మిషన్లు జరగాలి. సెక్షన్ -11లో సూచించిన విధంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు గవర్నింగ్ బాడీ నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలి. వసూలు చేసే ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలి. సెక్షన్ -12 ప్రకారం విద్యార్థుల, ఉపాధ్యాయుల నిష్పత్తి 1:20కి మించరాదు. ప్రతి పాఠశాలలో 25 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మైనార్టీలకు కేటాయించాలి.
ఇందులో వికలాంగులు, అనాథలు, హెచ్‌ఐవి బాధితులు, వీధి బాలలకు 5 శాతం, ఎస్సీ బాలలకు 10 శాతం, ఎస్టీ బాలలకు 4 శాతం, వెనుకబడిన బలహీన వర్గాలకు 6 శాతం కేటాయింపు జరిగింది. మొత్తం 25 శాతం. వీటి ప్రకారం ఎక్కడా పూర్తి స్థాయిలో అమలు జరగడంలేదు. సెక్షన్ 18 ప్రకారం ప్రభుత్వ నిర్ణీత గడువు తర్వాత కూడా గుర్తింపులేని పాఠశాలను నడిపితే రూ. లక్ష జరిమానా విధిస్తారు. ఒకవేళ జరిమానా తర్వాత కూడా గుర్తింపు లేకుండా మళ్లీ పాఠశాలను నిర్వహిస్తే రోజుకు రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ఏ పాఠశాలలోనూ బోధనా రుసుం కాకుండా ఇతర రూపాల్లో ఎలాంటి ఫీజు (క్యాపిటేషన్ ఫీజు) వసూలు చేయరాదు. అలా చేస్తే దానికి 10 రెట్లు జరిమానా విధిస్తారు.
పాఠశాలలో పుస్తకాల అమ్మకాలు అరికట్టాలి..
ప్రైవేటు విద్యాసంస్థలు అక్రమంగా విద్యాసామగ్రిని విక్రయిస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం ఏ విద్యాసంస్థలో కూడా పుస్తకాలు, యూనిఫామ్ అమ్మరాదు. అలా చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా అలా జరగడం లేదు. తమ దగ్గరే యూనిఫామ్, పుస్తకాలు కొనుగోలు చేయాలంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ పెద్దలకు చెందినవి కావడంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు తమకు నచ్చిన చోట విద్యాసామగ్రిని తెచ్చుకునే సౌలభ్యం కల్పించాలి. విద్యాశాఖ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి.
విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం...
ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోంది. నేడు రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు మండల స్థాయి వరకు విస్తరించి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వం, అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. పేద, మధ్యతరగతి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు జలగల్లా పట్టి పీలుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఫీజు నియంత్రణ కమిటీ వేస్తామని చెప్పినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
2009 విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు మొత్తం సీట్లలో 25 శాతం పేద పిల్లలకు కేటాయించాలి. కానీ రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు విద్యాహక్కు చట్టాన్ని పట్టించుకున్న దాఖలా లేదు. వీటిపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ కనిపించడంలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకుని,ఈ విద్యా సంవత్సరం నుంచే ఫీజు నియంత్రణ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు కోరుతున్నారు.






