23 May, 2026 | 2:57 AM

మధిర రైల్వేస్టేషన్‌పై సవతి ప్రేమ!

23-05-2026 01:50 AM
  1. రోజురోజుకు తగ్గుతున్న  ప్రాధాన్యత
  2. కీలక ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపేజీలు రద్దు 
  3. ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు..ప్రజలు
  4. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టించుకుని సమస్యను 
  5. పరిష్కరించాలని ప్రజల వినతి

మధిర, మే 22 (విజయ క్రాంతి): ఖమ్మం జిల్లాలో ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఒకటైన మధిర రైల్వే స్టేషన్కు రోజురోజుకూ ప్రాధాన్యం తగ్గుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రత్యేక రైళ్లుగా నడిచిన సమయంలో మధిరలో ఆగిన పలు ఎక్స్ప్రెస్ రైళ్లు, ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లుగా మారిన తర్వాత స్టాపేజీలు తొలగించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి 07189-07190, 07015-07016, 07031-07032 నంబర్లతో నడిచిన ప్రత్యేక రైళ్లు గతంలో మధిరలో ఆగేవని, ప్రస్తుతం ఆ సౌకర్యం లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

అలాగే 12763 పద్మావతి ఎక్స్ప్రెస్, 12861 విశాఖపట్నంమహబూబ్నగర్ ఎక్స్ప్రెస్, 12655/56 నవజీవన్ ఎక్స్ప్రెస్ వంటి రైళ్ల స్టాపేజీలు కూడా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అదేవిధంగా 17045/46 చర్లపల్లిఅనకాపల్లి, 12738 లింగంపల్లికాకినాడ పోర్ట్, 17633/34 మరియు 17635/36 నాందేడ్‌తిరుచానూరు, ధర్మవరం రైళ్లకు కూడా మధిరలో స్టాపేజీలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం అనేక మంది ప్రయాణికులు ఖమ్మం, విజయవాడ లేదా సికింద్రాబాద్ వరకు వెళ్లి రైళ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల అదనపు ఖర్చుతో పాటు సమయం వృథా అవుతోందని అంటున్నారు.

ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, వైద్య అవసరాల కోసం వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మధిర స్టేషన్కు సరిపడ ఆదాయం లేదనే కారణంతో స్టాపేజీలు తొలగించారనే ప్రచారాన్ని ప్రజలు ఖండిస్తున్నారు. కరోనా సమయంలో కూడా మధిర స్టేషన్ మంచి ఆదాయం అందించిన స్టేషన్లలో ఒకటని గుర్తు చేస్తున్నారు. మధిరతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కూడా ఈ స్టేష్ప ఆధారపడుతున్నారని పేర్కొంటున్నారు.

ఇక అమృత్ భారత్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్లాట్ఫామ్ అభివృద్ధి, వేచిచోట్ల సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్య పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని ప్రయాణికులు అంటున్నారు. మధిర రైల్వే స్టేషన్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని గతంలో ఆగిన అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లకు మళ్లీ స్టాపేజీలు కల్పించాలని ప్రజలు, ప్రయాణికుల సంఘాలు, సామాజిక సంస్థలు కేంద్ర రైల్వే శాఖను కోరుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీలు పక్కన పెట్టి మధిర ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాడాలని డిమాండ్ చేస్తున్నారు.