15-10-2025 08:00:47 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..
కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆకాంక్షిత బ్లాక్ లో భాగంగా జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం న్యూఢిల్లీ నుండి నీతి అయోగ్ సి.ఈ.ఓ. రజత్ కుమార్ సైని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో నీతి అయోగ్ క్రింద చేపడుతున్న ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పన అంశాలపై సమీక్షించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లా కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని తిర్యాణి బ్లాక్ లో నీతి అయోగ్ లో భాగంగా గిరిజన గ్రామాలలో మౌలిక వసతులు, నైపుణ్యత శిక్షణ, వ్యవసాయ రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నీతి అయోగ్ పథకం ద్వారా మంజూరైన నిధులతో ఆరోగ్యం, న్యూట్రిషన్, విద్యారంగంలో వసతుల కల్పన, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాల మంజూరు, మౌలిక వసతుల కల్పన, గిరిజనులకు వైద్య సేవలు అందించేందుకు పూర్తి సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మినీ అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, పాఠశాలల భవనాల నిర్మాణం, రైతు వేదికలు, పాఠశాలలలో కంప్యూటర్లు సమకూర్చడం, మౌలిక వసతులు, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలతో పాటు ఆకాంక్షిత బ్లాక్ ప్రాంతాలలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను తెలియజేశారు. తిర్యాణి బ్లాక్ లో భాగంగా గిరిజనులకు ఉపాధి అవకాశాల కల్పన, గ్రంథాలయ ఏర్పాటు, గిరిజనులకు కనీస వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, ఉపగణాంకాధికారి వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.